కొత్త గ్రామర్ నేర్పించిన పసివాడు - Nostalgia

By iDream Post Jul. 23, 2021, 07:00 pm IST
కొత్త గ్రామర్ నేర్పించిన పసివాడు - Nostalgia

చిన్నపిల్లాడిని టైటిల్ రోల్ లో పెట్టి అందులో స్టార్ హీరోతో సినిమా చేయడాన్ని ఊహించగలమా. ఇందులో రిస్క్ ఉంటుంది. కాకపోతే కథలో బలముండి క్లాసు మాసుని మెప్పించే అంశాలు ఉంటే బ్లాక్ బస్టర్ ఖాయం. దానికి మంచి ఉదాహరణగా పసివాడి ప్రాణంని తీసుకోవచ్చు. 1987లో మమ్ముట్టి హీరోగా మలయాళంలో 'పూవిన్ను పుతియా పూన్ తెన్నాల్' సినిమా వచ్చింది. అందులో పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. ఫాజిల్ దర్శకుడు. దీన్ని మళ్ళీ తమిళ్ లో సత్యరాజ్ హీరో అదే ఫాజిల్ 'పూవిళిల్ వాసలిలే'గా రీమేక్ చేస్తే ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది కూడా అదే ఏడాది రిలీజయ్యింది. వీటికి అసలు మూలం హాలీవుడ్ మూవీ 'విట్నెస్'

తెలుగు రీమేక్ హక్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడితే దాన్ని గీత ఆర్ట్స్ సంస్థ తరఫున అల్లు అరవింద్ కొనేశారు. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టు రచయిత జంధ్యాల గారితో కీలక మార్పులు చేయించి క్రైమ్ థ్రిల్లర్ ని పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారు. విజయశాంతి హీరోయిన్ గా చక్రవర్తి గారితో బ్రహ్మాండమైన ట్యూన్స్ సిద్ధం చేయించారు. రఘువరన్ మెయిన్ విలన్ గా కన్నడ ప్రభాకర్, గుమ్మడి, బాబ్ ఆంటోనీ, అల్లు తదితరులను కీలక పాత్రలకు తీసుకున్నారు. ముందు ఏవేవో టైటిల్స్ అనుకున్నారు కానీ ఫైనల్ గా 'పసివాడి ప్రాణం'కి అందరూ ఓటేశారు. చిత్రీకరణ సమయంలో బేబీ సుజిత యాక్టింగ్ కి అందరూ ఆశ్చర్యపోయారు.

ఇందులో బ్రేక్ డాన్స్ రూపంలో చిరంజీవి ఒక కొత్త ట్రెండ్ ని పరిచయం చేశారు. చక్కని చుక్కల పాటకు యువత వెర్రెక్కిపోయారు. అప్పటిదాగా స్క్రీన్ మీద చూడని వేగానికి వహ్వా అనకుండా ఉండలేకపోయారు. జీవితం మీద నిరాశతో తాగుబోతుగా మారిన ఓ యువకుడి జీవితంలో మాటలు రాని చెవులు వినిపించని ఓ చిన్న కుర్రాడు ప్రవేశించాక జరిగే పరిణామాలను దర్శకులు ఏ కోదండరామిరెడ్డి చూపించిన తీరుకి బాక్సాఫీస్ సాహో అంది. 38 సెంటర్లలో శతదినోత్సవం చేసుకుంది. తిరుపతి మినీ ప్రతాప్ లో 175 రోజులు 5 ఆటలు ప్రదర్శింపబడటం ట్రేడ్ ని షాక్ కి గురి చేసింది. 1987 జూలై 23 విడుదలైన పసివాడి ప్రాణం చిరంజీవి ఇమేజ్ ని వంద మెట్లు ఒకేసారి ఎక్కించేసింది. రష్యన్ భాషలో అనువాదమై అక్కడా ఘనవిజయం సొంతం చేసుకుంది

Also Read: More Nostalgia Articles

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp