iDreamPost
android-app
ios-app

అబద్ధాల ‘కళా’ వెంకటరావు

అబద్ధాల ‘కళా’ వెంకటరావు

అబద్ధాలు ఆడితే అతికినట్లుండాలి అంటారు. అబద్ధాలు ఆడటం అనేది కూడా ఒక కళ. ఎవరో చంద్రబాబు లాంటి వారికి తప్ప ఆ కళ అందరికీ పెద్దగా అబ్బదు. అయితే తమ అధినేత కళను తాము కూడా వంటబట్టించుకోవాలనే లక్ష్యంతో టిడిపి నాయకులు బాబు బాటలో పయనిస్తూ బొక్క బోర్లా పడుతున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన వెంటనే విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉండే టిడిపి నేతలు ఈరోజు కూడా తమ గళాలకు పదును పెట్టారు. ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే జగనన్న విద్యా దీవెన పథకం ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. దాంతో పాటు గత రెండేళ్లలో రీయింబర్స్మెంట్ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లను కూడా చెల్లించారు.

సీఎం అలా జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రారంభించారు లేదో ఇలా టిడిపి నేతలు లైన్ లోకి వచ్చారు. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి లక్ష 50 వేల రూపాయలు ఇస్తానని సీఎం జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని, అయితే ఈ మూడు పథకాల కింద కేవలం 70 వేలు మాత్రమే ఇస్తూ 80 వేలు కోత పెట్టడం మోసం కాదా అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు ప్రశ్నించారు.

టిడిపి ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న 1800 కోట్ల రూపాయలను జగన్ ప్రభుత్వం విడుదల చేయడంతో.. తమ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 16 వేల రూపాయలు ఖర్చు పెట్టామని కళావెంకట్రావు పేర్కొన్నారు. అంతే కాదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిన 2,400 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం చెల్లించిందని చెప్పుకొచ్చారు. బకాయిలు పెట్టడం అన్ని ప్రభుత్వాలకు సర్వసాధారణమని చెప్పడం కళావెంకట్రావు ఉద్దేశం కాబోలు.

ఇక తమ అధినేత చంద్రబాబు రెండు డీఎస్సీలో 17 వేల మంది ఉపాధ్యాయులు నియమిస్తే యూనివర్సిటీ పాలకమండలి సీఎం జగన్ సామాజిక న్యాయాన్ని మంట కలిపారని కళా వెంకటరావు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ కళావెంకట్రావుకు అసలు విషయం తెలియక ఇలా చెబుతున్నారా..? లేక అబద్ధాలు చెబుతున్నారో తెలియడం లేదు. 2018 డిఎస్సి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికీ పెండింగ్లోనే ఉందన్న విషయం కళా వెంకటరావు ఇప్పటికైనా తెలుసుకోవాలి.

రాష్ట్రంలో విద్యావ్యవస్థను సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగజార్చారని కళావెంకట్రావు విమర్శించారు. ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో పెట్టడం విద్యావ్యవస్థను దిగజార్చడం కిందకు వస్తుందనే భావనలో కళా వెంకటరావు పై విధంగా ఆరోపణలు చేసినట్లు ఉన్నారు. పేద ప్రజలు తమ పిల్లల చదువుల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. కేవలం ఇంగ్లీష్ మీడియం అనే కారణంతో ప్రైవేటు పాఠశాలలకు తమ రెక్కల కష్టాన్ని ధారపోస్తున్నారు.

అలాంటి వారి బతుకులు మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లీష్ మీడియంలో బోధన జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. అలా చేయడమే విద్యా వ్యవస్థను దిగజార్చడం కిందకు వస్తుందేమో టీడీపీ రాష్ట్ర రథసారథి, మాజీ మంత్రి అయిన కళా వెంకటరావు సెలవు ఇవ్వాలి.