iDreamPost
android-app
ios-app

నిర్భయ దోషుల ఉరి పై న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

నిర్భయ దోషుల ఉరి పై న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు

నిర్భయ దోషుల ఉరిశిక్ష నిలుపుదల విచారణ సందర్భంగా ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు న్యాయమూర్తి ధర్మేంద్ర రానా కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులందరికి ఒకేసారి శిక్ష విధించాలని వివరించారు. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి గుర్తింపు వంటిదని అభివర్ణించారు.

‘‘ఈ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకు ముఖేష్‌(క్యూరేటివ్‌ పిటిషన్ కొట్టివేత‌, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణ, రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌ను సైతం కొట్టివేసింది)కు చట్టపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అయితే మిగతా ముగ్గురికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. మన దేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు. మరణ శిక్ష కూడా ఇందుకు మినహాయింపు కాదు. కాబట్టి ముఖేష్‌ ఒక్కడినే ఉరి తీయడం సాధ్యం కాదు.

జైలు మ్యానువల్‌లోని రూల్‌ 836 ప్రకారం… ఒకే కేసులో ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు దోషులుగా తేలినపుడు… ముఖ్యంగా మరణశిక్ష ఎదుర్కొంటున్నపుడు… ఒక దోషి లేదా ఆ కేసులో మిగిలిన దోషులంతా నేరుగా గానీ.. వారి తరఫున మరెవరైనా గానీ పిటిషన్‌ దాఖలు చేసినట్లయితే.. ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు.