Idream media
Idream media
జేసీ దివాకర్ రెడ్డి.. ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేనిది. ఆయన ఏమి మాట్లాడినా.. బ్రేకింగ్ న్యూస్. అందరూ ప్రెస్‌మీట్లు పెట్టాలి.. కానీ జేసీకి ఆ అవసరం లేదు. జేసీతో మాట్లాడించేందుకే మీడియా ప్రతినిధులు ఆయన వెంటపడుతుంటారు. రాజకీయాల్లోనూ జేసీ శైలి ఎంతో భిన్నమైంది. ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా వ్యవహరిస్తూ అందిరికీ ఆదర్శింగా ఉంటున్నారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులంటే.. అధికార పార్టీ ఏమి చేసినా విమర్శించాలనే ధోరణితో ఉంటారు. కానీ జేసీ దివాకర్ రెడ్డి ఇందుకు పూర్తిగా భిన్నం. మంచి చేస్తే.. మంచంటారు.. చెడు చేస్తే చెడంటారు. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. తాజాగా ఆయన సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించి మరో సారి వార్తల్లో నిలిచారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా చేసి జగన్ మంచిపని చేశాడని కొనియాడారు. సీఎం జగన్ తెలివైనోడన్నారు. ఎన్నికల నిర్వహణ సమయం కుదించడం స్వాగతించదగ్గ విషయమన్నారు.
ఇటీవల జేసీ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేశారు. జేసీ దివాకర్ రెడ్డి కంపెనీకి గతంలో కేటాయించిన గనుల లీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో వైఎస్ జగన్‌పై జేసీ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ తమను ఇబ్బంది పెట్టడం కంటే.. ఒకే సారి చంపేయొచ్చు కదా అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. తమను సీఎం జగన్ ఇంత ఇబ్బంది పెట్టారని వాపోయిన జేసీ దివాకర్ రెడ్డి.. తాజాగా జగన్‌పై ప్రశంసలు కురిపించడం.. ఆయన వ్యవహారశైలి సగటు రాజకీయ నాయకుడికి భిన్నమని తెలియజేస్తోంది.
స్థానిక సంస్థలక తాము దూరంగా ఉంటున్నామని జేసీ ప్రకటించారు. అయితే తాడిపత్రిలో ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడుపై జేసీ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు. ఎన్నికలకు దూరం అన్న జేసీ దివాకర్‌రెడ్డి యూటర్న్ తీసుకుని మళ్లీ రంగంలోకి వచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల్లో అక్రమాలు అరికట్టాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.
ఎన్నికల కమిషనర్‌ను కలిసిన జేసీ ఓ ప్రతిపాదన చేశారు. పోలింగ్ బూత్‌లలో సీసీ కెమెరాలు పెట్టాలని కోరారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందనే అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమరాలకు డబ్బుల్లేకపోతే.. తమ పార్టీ భరిస్తుందని జేసీ దివాకర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సూచించడం విశేషం.