iDreamPost
android-app
ios-app

జేసీకి ఊరట లభిస్తుందా..?

జేసీకి ఊరట లభిస్తుందా..?

ఫోర్జరీ పత్రాలతో బీఎస్‌ 3 వాహనాలను బీఎస్‌ 4 వాహనాలుగా మార్చిన వ్యవహారంలో అరెస్ట్‌ అయిన టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు, 2019 ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసీ అస్మిత్‌లకు బెయిల్‌ మంజూరు చేయాలని జేసీ భార్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషష్‌ ఈ రోజు విచారణకు రానుంది. ఇప్పటికే జేసీ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనంతపురం జిల్లా కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో హైకోర్టుపైనే జేసీ కుటుంబం ఆశలు పెట్టుకుంది.

వాహనాల అక్రమ అమ్మకాల కేసులో అనంతపురం రవాణాశాఖ అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం పోలీసులు ఈ నెల 14వ తేదీన జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డిలను హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. అనంతపురం తీసుకొచ్చి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. అనంతపురం జైలులో కొద్ది గంటపాటు ఉంచిన పోలీసులు కోవిడ్‌ భయాల నేపథ్యంలో వారిద్దరిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.

గత సోమవారం తమకు బెయిల్‌ మంజూరు చేయాలని జేసీ పిటిషన్‌ దాఖలు చేయగా.. వారిద్దరినీ మరింత విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించిన అనంతపురం కోర్టు.. జేసీ బెయిల్‌ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ వారిని రెండు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి ఇచ్చింది. నిన్నటితో పోలీస్‌ కస్టడీ ముగియడంతో తిరిగి వారిని పోలీసులు వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. తొమ్మిది రోజులుగా జైల్లో ఉన్న తండ్రి, కొడుకులకు హైకోర్టులోనైనా ఊరట లభిస్తుందా..? లేదా..? ఈ రోజు సాయంత్రానికి తేలనుంది.