iDreamPost
android-app
ios-app

పార్ట్ టైం రాజకీయం

పార్ట్ టైం రాజకీయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరించే తీరు ప్రజలతోపాటు ఆపార్టీ కార్యకర్తలకు కూడా అర్ధం కాదు. లోకమంతా ఒక తీరు ఉంటే నేనొక్కడినే ఒకతీరు అన్నట్టుగా పవన్ తీరు ఉంటుందనేది అనేక సందర్భాల్లో రుజువైంది. ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభణతో అధికారులు, రాజకీయ నాయకులు, మేధావులు ఏంచేయాలో పాలుపోని సమయంలోనూ పవన్ తన వైఖరిని మార్చుకోలేకపోయారు. తాజాగా ఆయన నిర్వహించిన కార్యక్రమాలపై నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. మార్చి 17వ తేదీన కూడా అందరూ కరోనా కట్టడికి, కరోనాపై ముందు జాగ్రత్తలు చెప్తూ సోషల్ మీడియాలోనూ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే జనసేన పార్టీ సోషల్ మీడియా కూడా పవన్ కళ్యాణ్ మన నుడి మన నది కార్యక్రమాలను ప్రమోట్ చేస్తోంది. తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించారు. అప్పటినుంచి రెండో విడత మన నుడి – మన నది కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్య్రమాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఓ స్టార్ హీరో, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు భాషకోసం, మన నదులకోసం పోరాటం చేయడం మంచి పరిణామమే కానీ.. కరోనాతో ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని, జన సమూహం పెరగకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తుంటే పవన్ కళ్యాణ్ సభలు నిర్వహించడం అందులోనూ అసందర్భ పోరాటాలు చేయడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలోనే మన నది, మన నుడి ప్రోగ్రామ్ లను పవన్ ప్రారంభించినా మూడు నెలలక్రితమే వాటిని వదిలేసి సినిమాల్లోకి వెళ్లిపోయారు. అసలు సినిమాలను పూర్తిగా వదులుకుని తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకుని ఆమాట తప్పారు.. అది వేరే విషయం.. అయితే సినిమా షూటింగ్ లలో గ్యాప్ వస్తే ప్రజా పోరాటాలు చేయడం రాజకీయ నాయకుడి లక్షణం కాదనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ మరో సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సిఉంది. కానీ కొద్దిరోజులక్రితమే కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షూటింగ్ లు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం, టాలీవుడ్ పెద్దలు ఓ నిర్ణయానికి రావడంతో ఈ కరోనా గ్యాప్ లో పవన్ కళ్యాణ్ మన నది, మన నుడి పోరాటాలు మళ్లీ ప్రారంభిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఏకంగా జనసేన అఫీషియల్ సోషల్ మీడియాల్లోనే తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్తశుద్ధి లేని పోరాటాలు, చిత్తశుద్ధి లేని రాజకీయాలు తమ గమ్యాలను చేరుకోలేవని పవన్ ఇప్పటికైనా గ్రహించాలనిసి సూచిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ భారీ ఓటమి చవి చూడటానికి తనపై ఉన్న పార్ట్ టైం పొలిటీషియన్ అనే ముద్ర కూడా ఓ ప్రధాన కారణం. ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే మరోసారి భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.