iDreamPost
iDreamPost
జనసేన.. అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టానని అంటూ ముందుకొచ్చారు. కానీ అంతలోనే అధికారం మాదేనంటూ 2019 ఎన్నికల బరిలో దిగారు. పదవులు కోసం కాదు, పాతికేళ్ల భవిష్యత్ ముఖ్యం అంటూ చెప్పినా ఎన్నికల పోరాటంలో చతికిలపడ్డారు. మళ్లీ ఇప్పుడు తనకు అధికారం దక్కుతుందో లేదో తెలియదంటూ అధినేతే చెబుతున్నారు. ఇలా ఒక్కో తడవ ఒక్కో మాట మాట్లాడుతూ తాను సందిగ్ధంలో ఉన్న సంగతిని అందరికీ చాటుతున్న పవన్ కళ్యాణ్ తీరుతో ఆపార్టీ శ్రేణులు గందరగోళంలో పడుతున్నారు. తమ భవితవ్యంపై అయోమయంగా కనిపిస్తున్నారు. ఆయన్ని నమ్ముకుంటే ఇక పార్టీ పరిస్థితి తర్వాత..తమ రాజకీయ భవిష్యత్ కూడా అనుమానమేననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ని వెంట సినీ అభిమానులు మాత్రం నేటికీ చెక్కు చెదరలేదు. ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన 30 ఏళ్ల లోపు యువతరంలో ఆయన మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రాంతాలకు అతీతంగా పవన్ పిలుపునిస్తే కదిలే ఫాలోయింగ్ ఉండడమే పవన్ కి పెద్ద పొలిటికల్ పెట్టుబడిగా కనిపిస్తోంది. దానిని ఉపయోగించుకుని అటు సినీ, ఇటూ రాజకీయ రంగాల్లో కొనసాగాలని పవన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులున్నాయి. సినిమాలకు స్వస్తిచెప్పి, పూర్తిగా ప్రజా జీవితానికే అంకితం అంటూ చెప్పిన ఆయన మళ్లీ వరుసగా సినిమాలు ప్రారంభిస్తున్నారు. కెరీర్ పీక్ లో ఉన్నప్పటి కన్నా వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏకకాలంలో నాలుగు సినిమాలు అంగీకరించి, మూడు సినిమాలు ప్రారంభించేందకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడం విశేషం.
ఫ్యాన్స్ సంగతి ఎలా ఉన్నప్పటికీ పవన్ నమ్ముకుని వచ్చిన పలువురు రాజకీయ నేతలు మాత్రం ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. తాజాగా ఆ వరుసలో మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ చేరబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పవన్ తీరుతో కొంత అసహనంగా ఉన్నారు. వైఎస్సార్సీపీలో కొనసాగితే ఖచ్చితంగా పదవి దక్కుతుందనే ధీమా ఉన్నప్పటికీ దాన్ని వదులుకుని జనసేన లో చేరితో తగిన గౌరవం కూడా దక్కడం లేదని ఆయన వాపోతున్నారు. సొంతంగా 99టీవీ ప్రారంభించి పవన్ మౌత్ పీస్ లా మార్చినా ఒరిగిందేమీ లేదనే అసంతృప్తి ఆయనలో కనిపిస్తోంది. ఈ పరిణామాలతో ఇక రాజకీయాలకు స్వస్తిచెప్పడమా లేక పవన్ కి గుడ్ బై చెప్పి మళ్లీ వైఎస్సార్సీపీ వైపు మళ్లడమా అనే ఆలోచన చేస్తున్నారు. తొలుత ఆయన ప్రజారాజ్యం తరుపున గుంటూరు పార్లమెంట్ కి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆతర్వాత 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైఎస్సార్సీపీ తరుపున పార్లమెంట్ కి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. చివరకు మొన్నటి ఎన్నికల్లో గుంటూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా జనసేన ప్రభావం చూపలేక ఆయన ఢీలా పడ్డారు. మూడు ఓటములతో ఆయన భంగపడిన తర్వాత కూడా జనసేనలో కొనసాగాలని ఆశించినా పార్టీ వ్యవహారాలు తిరోగమనంలో ఉన్నాయనే అభిప్రాయానికి తోట చంద్రశేఖర్ వచ్చినట్టు సన్నిహితుల సమాచారం. ఈ పరిస్థితుల్లో తనదారి తాను చూసుకోవడం ఉత్తమమని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు.
ఇప్పటికే కీలక నేతలంతా ఒక్కొక్కరుగా చేజారిపోతున్న వేళ జనసేనలో పవన్ వెంట ఎవరు మిగులుతారనేది సందేహంగా మారుతోంది. నాయకత్వం దూరం కావడం, పార్టీ పనితీరు సక్రమంగా లేకపోవడంతో పవన్ ని అభిమానించే ఫ్యాన్స్ ని నడిపించే నాథుడు కరువయ్యే ప్రమాదం ఉంది. కనీసం కమిటీలు, పార్టీ కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేకపోవడంతో ఇక జనసేన దిశానిర్ధేశం లేని సమూహంగా మారడం ఖాయంగా కనిపిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతమంది పార్టీ కోసం ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టుకోల్పోయే ప్రమాదం దాపురిస్తోందని చెబుతున్నారు. ఇది జనసేన పార్టీకి ఆత్మహత్యాసదృశ్యం మాదిరి తయారయ్యే ప్రమాదం గోచరిస్తోంది. అయినా తనకు పట్టదని పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటిస్తున్న వేళ జనసేన పూర్తిగా బీజేపీలో మిళితం అయ్యే సూచనలు స్పష్టమవుతున్నాయనే అబిప్రాయం బలపడుతోంది.