iDreamPost
android-app
ios-app

రైతుల సమస్యలపై రెండు నాలుకల ధోరణిలో జనసేనాని

  • Published Dec 07, 2020 | 1:51 AM Updated Updated Dec 07, 2020 | 1:51 AM
రైతుల సమస్యలపై రెండు నాలుకల ధోరణిలో జనసేనాని

రైతు సమస్యలపై స్పందించాలనుకునే వారంతా ప్రస్తుతం దేశంలో వ్యవసాయ చట్టాల మీద స్పందిస్తున్నారు. ఆ చట్టాల రద్దు కోసం వేల మంది నిండు చలిలో రోడ్డున పడి ఉద్యమిస్తున్న నేపథ్యంలో వారికి మద్ధతు పలుకుతున్నారు. భారత్ బంద్ లో కూడా తాము పాల్గొంటామని పలు పార్టీల నేతలు కూడా చెబుతున్నారు. సరిగ్గా అదే సమయంలో 8వ తేదీన రైతు సమస్యల పరిష్కారం కోసం భారత్ బంద్ జరుగుతుంటే దానికి దూరంగా ఉంటున్న జనసేనాని, ఈనెల 7 రైతు సమస్యలపై ఆందోళనలకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా మారింది. పవన్ కళ్యాణ్ రెండు నాలుకల ధోరణికి అద్దంపడుతోంది. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపిరికట్టెది మరో దారి అన్న చందంగా మారింది.

దేశమంతా రైతులంతా ఒక్కటై కదులుతుంటే వారిని విభజించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా పలువురు సందేహిస్తున్నారు. రైతు ఉద్యమంలో చీలిక కోసం, రైతుల ఆకాంక్షలకు భిన్నంగా పవన్ కళ్యాణ్‌ ప్రహసనం నడుపుతున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఓవైపు రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న చట్టాలకు ఆయన మద్ధతు పలుకుతూ మరోవైపు తాను రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నట్టు చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అతని అసలు రంగు బయటపెడుతోందని పలువురు రైతు నేతలు సైతం విమర్శిస్తున్నారు.

రాబోయే ఉప ఎన్నికలకు అనుగుణంగా తిరుపతి చుట్టూ ఆయన ప్రదిక్షణలు చేస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ సీటులో రాజకీయ ప్రయోజనాల కోసం రైతు సమస్యల పేరుతో ఆయన నడుపుతున్న కొత్త డ్రామాని ఇప్పటికే అనేక మంది గుర్తించారు. దాంతో చివరకు జనసేన కార్యక్రమాలకు రైతులు ఆశించిన సంఖ్యలో లేకపోవడంతో తమ పార్టీకి చెందిన యువకులనే రైతులుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో రైతు సమస్యల పట్ల తనకు చిత్తశుద్ధి లేదని చాటుకుంటున్న తీరు గమనార్హం.

దేశమంతా కొత్త చట్టాల పట్ల రైతులు కలత చెందుతుంటే పవన్ కి మాత్రం జగన్ ప్రభుత్వమంటే ఉలిక్కిపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పంట నష్టపరిహారం కోసం ఈనెల15 లోగా అంచనాలు పూర్తి చేసి, 30వ తేదీ లోగా నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా స్పష్టమైన ప్రకటన చేశారు. అయినా ప్రభుత్వం ఇస్తామని చెప్పిన తర్వాత ఏపీ లో ఆందోళనకు పూనుకుంటున్న పవన్, అదే సమయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో చలిలో కొందరు రైతులు ప్రాణాలు కూడా పోతున్న వేళ నోరు మెదపకపోవడం అతని నైజాన్ని చాటుతుందని రైతులు అంటున్నారు. రైతుల ముసుగులో పవన్ చేసే రాజకీయాకలు పెద్దగా ప్రయోజనం ఉండదనే విషయం రైతులంతా గ్రహించినట్టు వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి నయవంచనతో రైతులను ముంచాలనే యత్నాలు పవన్ మానుకోవాలని సూచిస్తున్నారు.