iDreamPost
iDreamPost
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి అని జనసైనికులు బలంగా నమ్ముతున్నారు. కొన్నిచోట్ల ఏపీకి కాబోయే సీఎం అని ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను సీఎం కావడం కంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి సీఎం కాకుండా చేయడమే తన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం మరోసారి తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్నట్లుగా పరోక్షంగా సంకేతాలు కూడా ఇస్తున్నారు. తాజాగా ఆయన మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయం అనిపిస్తోంది.
మొదటినుంచి పొత్తుల విషయంలో పవన్ మాటల్లో స్పష్టత కనిపించడం లేదు. ఒకసారేమో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది, తానే సీఎం అవుతాను అన్నట్లుగా మాట్లాడతారు. మరోసారేమో జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంటారు. ఇక ఇప్పుడేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యమని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే టీడీపీ కలిసి పోటీ చేస్తామని హింట్ ఇచ్చినట్లుంది.
తాజాగా పల్నాడులో జరిగిన జనసేన కౌలు రైతుల భరోసా యాత్రలో పాల్గొన్న పవన్.. వచ్చే ఎన్నికల గురించి ఆస్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత తనదని పవన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని సవాల్ చేశారు. పవన్ మాటలను బట్టి చూస్తే వైసీపీ విజయాన్ని అడ్డుకోవడం కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లుగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయడంతో 23 సీట్లకే పరిమితమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన దోస్తీ కోసం టీడీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా పవన్ సైతం పొత్తుకి సై అన్నట్లుగా సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే జనసేన పార్టీని టీడీపీలో భాగమంటూ వైసీపీ నేతలు విమర్శిస్తూ ఉంటారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ అడుగులు ఉంటాయని కూడా వాళ్ళు విమర్శిస్తుంటారు. అయితే జన సైనికులు మాత్రం తమ నాయకుడికి ఎవరి సపోర్ట్, డైరెక్షన్ అవసరం లేదని.. ఆయన ఏపీ రాజకీయాలను శాసిస్తాడని అభిప్రాయ పడుతుంటారు. కానీ పవన్ మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేస్తానని పరోక్షంగా కామెంట్స్ చేసి జన సైనికులకు షాకిచ్చారు. టీడీపీతో పొత్తు ఉండదు, కాబోయే సీఎం పవనే అంటూ కలలు కంటున్న వారిని.. పవన్ మాటలు ఇరకాటంలో పడేశాయి. పవన్ ని సీఎం చేయాలని జనసేన కోసం పని చేయాల్సింది పోయి.. జగన్ సీఎం అవ్వకుండా చూడాలని టీడీపీ కోసం పని చేయాల్సి వచ్చేలా ఉందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.