iDreamPost
android-app
ios-app

నాగార్జున సాగర్ బై పోల్ : 12 రౌండ్ల‌కు ఒక‌సారే సీనియ‌ర్ ఆధిక్య‌త‌

నాగార్జున సాగర్ బై పోల్ : 12 రౌండ్ల‌కు ఒక‌సారే సీనియ‌ర్ ఆధిక్య‌త‌

నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో కారు హై స్పీడు తో దూసుకెళ్తోంది. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి 12వ రౌండ్‎లు పూర్తి కాగా టీఆర్ఎస్ స్ప‌ష్ట‌మూన ఆధిక్య‌త‌తో దూసుకెళ్తోంది. ఇక్క‌డ కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు జానారెడ్డి పోటీలో ఉండ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. తెలంగాణ‌లో ఆ పార్టీకి ప్ర‌స్తుతం క‌లిసి రావ‌డం లేద‌ని వ‌రుస ఎన్నిక‌లు తెలియ‌జేసిన‌ప్ప‌టికీ నాగార్జున‌సాగ‌ర్ లో జానారెడ్డి ప్ర‌భావం ప‌ని చేస్తుంద‌ని భావించారు. దీంతో విభేదాలను సైతం ప‌క్క‌న‌బెట్టి సీనియ‌ర్లు అంద‌రూ జానారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి జానారెడ్డికి మూడో కొడుకు ఉన్నాడు ఖ‌బ‌డ్దార్ అంటూ అధికార ప‌క్షానికి స‌వాల్ విసిరాడు. కానీ, ఇవేమీ ప‌నిచేయ‌లేద‌ని ఫ‌లితాలు తెలియ‌జేస్తున్నాయి.

12 రౌండ్ల ఫ‌లితాల‌ను ప‌రిశీలిస్తే కేవ‌లం 10వ రౌండ్‎లో మాత్ర‌మే కాంగ్రెస్ ఆధిక్య‌త సాధించింది. అది కూడా 175 ఓట్లు మాత్ర‌మే. జానా సొంత మండ‌లం అనుమ‌లలో మాత్ర‌మే ఆయ‌న‌కు టీఆర్ఎస్ కంటే కాస్త ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి. మిగతా అన్ని రౌండ్లలో నూ టీఆర్ఎస్ హవా న‌డిచింది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో దూసుకెళ్తున్నారు. 12 రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12వ రౌండ్‎లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌కు 3,833 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,578 ఓట్లు వచ్చాయి. న‌ల్గొండ జిల్లాకు చెందిన‌ జానారెడ్డి 30 ఏళ్లు ఎమ్మెల్యేగా, 17 ఏళ్లు మంత్రి గా కొన‌సాగారు. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ప్ర‌తి ఒక్క‌రితోనూ ఆయ‌న అనుబంధం ఉన్న‌ట్లుగా చెప్పుకుంటారు. తాను సీఎం స్థాయి వ్య‌క్తిన‌ని, ఇక్క‌డ పోటీ చేసే ఉద్దేశం లేక‌పోయినా పార్టీ ఆదేశాల మేర‌కు బరిలో నిలిచాన‌ని ప్ర‌క‌టించిన జానారెడ్డి కి ఫ‌లితాల స‌ర‌ళి ఒకింత ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌క త‌ప్ప‌దు.

నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆ పార్టీ తెలంగాణ పుంజుకుంటుందని కాంగ్రెస్ వాదులు చెప్పుకొచ్చారు. జానారెడ్డి కూడా నేను 6-7 సార్లు గెలిచాను నాకు తిరుగు లేదు అనుకుంటూ ప్ర‌చారంలో ముందుకెళ్లారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య, కాంగ్రెస్‌ నుంచి జానా రెడ్డి నిలబడ్డారు. ఆ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోరు కొనసాగింది. నోములకు 83,655 ఓట్లు పోలవ్వగా.. జానారెడ్డికి 75,884 ఓట్లు పోలయ్యాయి. కేవలం 4 శాతం (7, 771) ఓట్ల తేడాతో జానారెడ్డి ఓడిపోయారు. కానీ, ప్ర‌స్తుతం అంత‌కంటే త‌క్కువే ఓట్లే జానారెడ్డికి వ‌స్తాయ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. 25 రౌండ్ల‌కు గాను ఇంకా 13 రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్ల‌లో అయినా జానారెడ్డి సీనియార్టీకి కాస్తయినా ఆద‌ర‌ణ ద‌క్కుతుందేమో చూడాలి.

Also Read : నాగార్జున సాగ‌ర్ బై పోల్ : దూసుకెళ్తున్న కార్‌