iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఓ అసాధారణ చరిత్ర. ఉమ్మడి, విభజిత రాష్ట్రాల్లో ఎవరికీ సాధ్యం కానిది ఆయన సాధించారు. ఓ మఖ్యమంత్రి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసి రాష్ట్రంలో అత్యున్నత పీఠాన్ని ఆయన అధిగమించారు. అందుకు సొంతంగా పార్టీ పెట్టుకుని , సవాలక్ష సవాళ్లను ఎదుర్కొన్నారు. తొలి ఓటమిని సైతం ధీటుగా ఎదుర్కొని అఖండ మెజార్టీతో చరిత్ర సృష్టించారు. అలాంటి అనుభవాలతోనే తొలి ఏడాది ముఖ్యమంత్రి హోదాలో జగన్ తనదైన లక్ష్య సాధనవైపు సాగుతున్నట్టు కనిపిస్తోంది. అందుకు తన తండ్రినే మైలు రాయిగా మార్చుకున్నట్టు స్పష్టమవుతోంది.
మాట తప్పం..మడమ తిప్పం.. చాలా కాలం పాటు జగన్ పదే పదే చెప్పిన మాట. ఇప్పుడు అధికారంలో ఉండగా దానిని ఆచరించి చూపించాలనే లక్ష్యంతో జగన్ అడుగులు వేస్తున్నారు. ఆటంకాలు వచ్చినా అధిగమించి ముందుకెళ్లడం జగన్ రాజకీయ చరిత్రలో అడుగడుగునా కనిపించే దృశ్యం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. తన లక్ష్యాల సాధనలో ఎదురయ్యే రాజకీయ, న్యాయ సంబంధిత ఆటంకాలను అధిగమించడం పెద్ద సమస్య కాదనే ధీమాతో ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి పీఠం ఎక్కడానికి చంద్రబాబు 20 ఏళ్లు వేచి చూస్తే, వైఎస్సార్ సుమారు 3 దశాబ్దాలు సమయం తీసుకున్నారు. కేసీఆర్ కూడా 30 ఏళ్ల ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి స్థానానికి చేరారు. కానీ జగన్ అలా కాదు. కేవలం ఎనిమిదేళ్లలో సీఎం పదవికి చేరిపోయారు. ఎన్టీఆర్ సుదీర్ఘ సినీ క్రేజ్ తో ఏడాదిలోపు రాష్ట్రానికి సారధిగా బాధ్యతలు స్వీకరిస్తే జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని సీఎం అయిపోయారు. విపక్ష నేతగా కూడా జగన్ విన్నూత్న పంథాలో సాగారు. ముఖ్యంగా కొన్ని కీలక నిర్ణయాల విషయంలో జగన్ పట్ల అనేక మంది సన్నిహితులు కూడా భిన్నాభిప్రాయాలతో ఉండేవారు. ఉదాహరణకు అసెంబ్లీని బహిష్కరించి ప్రజల్లో ఉండాలనే విషయంలో జగన్ తీరు పట్ల సీనియర్లు కూడా సందేహంగా కనిపించేవారు. కానీ చివరకు సుదీర్ఘ పాదయాత్రే జగన్ కి అధికార యాత్రను చేసింది.
Also Read:వైఎస్. జగన్ అనే నేను…!
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్ ధోరణి కొందరికి మింగుడుపడడం లేదు. కీలక నిర్ణయాల విషయంలో ఆయన తీరు కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. అయినా జగన్ తన పంథాను మార్చడం లేదు. ఢీకొట్టడం, ధిక్కరించడం, ధైర్యంగా ముందుకు సాగడం అనే నైజం ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు. కీలకమైన మార్పుల సమయంలో అన్నింటినీ ఎదుర్కోవాల్సిందేనని ఆయన సన్నద్ధమయినట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే జగన్ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు న్యాయపరమైన ప్రయత్నాలు కూడా జరిగాయి. అయినా జగన్ అంతిమంగా తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి అడుగులు వేస్తున్నారు. ఆచరణలో ఓ పెద్ద మార్పునకు నాంది పలుకుతున్నారు. విద్యారంగాన్ని నాడు నేడు అన్నట్టుగా చేస్తామని చెబుతున్న ఆయన చేసి చూపుతున్నారు. అదే రీతిలో మూడు రాజధానుల అంశంలో వ్యూహాత్మక పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా ఎస్ ఈ సీ విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా జగన్ లో కలవరం కనిపించక పోగా, మరింత పట్టుదల ప్రదర్శించడానికి దోహదం చేస్తాయని సన్నిహితులు అంచనా వేస్తున్నారు.
సంక్షేమ పథకాల రూపంలో జగన్ వ్యవహారశైలి ఆయన తండ్రి తీరుని చాటుతోంది. ఈ విషయాన్ని జగన్ కూడా తన ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. నాన్న ఒక అడుగు వేస్తే నేను పది అడుగులు వేస్తానని చెప్పిన చందంగానే అన్నింటా వ్యవహరిస్తున్నారు. నాన్న మార్క్ ని నిరూపిస్తూ సంక్షేమ పాలనతో రాజన్న రాజ్యం అని చెప్పినట్టుగా చేయాలని సంకల్పించినట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా చెప్పిన మాటను నిలబెట్టుకున్న నేతగా వైఎస్సార్ తర్వాత జగన్ అనే ముద్ర బలంగా పడాలని ఆయన ఆశిస్తున్నారు. ఆ దిశలోనే తొలి ఏడాది పాలన స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. మ్యానిఫెస్టోలో రాసిన దానిని ప్రజలు గుర్తించకుండా చేయాలని ప్రయత్నించిన పాలన నుంచి అన్ని చోట్లా మ్యానిఫెస్టో బాహాటంగా ప్రదర్శిస్తూ, అందులో చెప్పిన ప్రతీ అంశాన్ని ఆచరణలో నిరూపించే దిశలో జగన్ పాలన సాగుతోంది. ఆ కమ్రంలో ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించేలా ప్రజల మన్ననలు పొందుతామని జగన్ తొలి నాడు చెప్పిన మాటకు తగ్గట్టుగా తొలి ఏడాది పాలన సాగించారు.
Also Read:ఏడాదిలో చెక్కు చెదరని ప్రజాభిమానం
రాజకీయంగా కూడా విలువలు- విశ్వసనీయత అనే జగన్ అదే మాటకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే తనకు మద్ధతుగా నిలిచిన వర్గాలతో పాటుగా అందరినీ ఆదరించే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఏడాది పాలనలో కోర్టు కేసుల రూపంలో ఎదురయిన చిన్న చిన్న చిక్కులు ఎలా ఉన్నా మొత్తంగా రాజకీయ లక్ష్యాల సాధనలో జగన్ అడుగులు ధృఢమైన పాలన దిశలో కనిపిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తీసుకొచ్చిన పాలనా మార్పుల నుంచి రాష్ట్ర స్థాయిలో మూడు రాజధానుల ద్వారా పాలనా వికేంద్రీకరణ వైపు సాగుతూ, పారిశ్రామిక పెట్టుబడు ఆకర్షణలో తనదైన శైలిలో అడుగులు వేస్తున్న జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పథంలో ముద్ర వేయడంతో సరిపెట్టుకుండా బలమైన పునాదులు నిర్మించుకునే దిశలో ప్రభుత్వ నడవడిక కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు అవకాశాలు జగన్ ముందుకనిపిస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రికీ లేని అరుదైన ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు వైఎస్సార్ కి కూడా ఉన్న పరిమితులు జగన్ కి లేవు. దాంతో అవకాశాలను ఒడిసిపట్టుకోవడమే ఇప్పుడు జగన్ కి కీలకాంశం. దాంతో ప్రత్యర్థి రాజకీయ పక్షాలకు మింగుడుపడని రీతిలో ముందుకెళుతున్న జగన్ పాలనలో రాబోయే ఏడాదిలో మరిన్ని కీలక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.