iDreamPost
iDreamPost
కొన్ని సార్లు సైలెన్స్ కూడా చాలా వయలెన్స్ గా కనిపిస్తుంది. సరిగ్గా ఇప్పుడు ప్రతిపక్షాలకు అలానే ఉంది. సీఎం జగన్ మౌనం టీడీపీ సహా పలు ప్రతిపక్ష పార్టీలకు అదే రీతిలో కనిపిస్తోంది. రాష్ట్రమంతా రాజధాని అంశంపై సాగుతున్న చర్చపై సీఎం కనీసం కూడా మాట్లాడడం లేదు. రాజధాని ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఎంత రాద్దాంతం చేస్తున్నా సీఎం మాత్రం తన పనితాను చేసుకుపోతున్నారు. చంద్రబాబు అన్నీ మానుకుని అమరావతి అంశం చుట్టూ తిరుగుతున్నా జగన్ మాత్రం జంకడం లేదు. పవన్ కూడా ఒకరోజు హడావిడి చేసి, మళ్లీ ఇప్పుడు కవాతు ఆలోచన చేస్తున్నా జగన్ ఒక్క ఇంచు కూడా కదులుతున్నట్టు లేదు. దాంతో ఈ వ్యవహారం విపక్ష నేతలకు మింగుడుపడడం లేదు.
వాస్తవానికి రాజధాని విషయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది పాలకపక్షమే. కొన్ని నెలలుగా బొత్సా సత్యన్నారాయణ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ అందరినీ సందిగ్ధంలో పెట్టారు. చివరకు సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకూ పనులు ప్రారంభం అయ్యే అవకాశం లేదని అంతా అనుకుంటుండగానే ఒకనాడు హఠాత్తుగా సీఎం సీఆర్డీయే కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో డిసెంబర్ నుంచి మళ్లీ రాజధాని పనులు తెరమీదకు రావడం ఖాయమని ఆశించారు. మళ్లీ మనసు మార్చుకున్న జగన్ అసెంబ్లీ సమావేశాల ముగింపు వేళ బాంబు పేల్చారు. మూడు రాజధానులంటూ కొత్త అంశాన్ని జనం ముందు పెట్టారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి తీరికలేదు. చంద్రబాబుకి పండగా, పబ్బం గడుపుకునే ఛాన్స్ కూడా కనిపించడం లేదు. సంక్రాంతికి సొంత ఇంటికి కూడా వెళ్లలేని స్థితి వచ్చింది. పవన్ కూడా అదే పరిస్థితి. అత్తారింట క్రిస్మస్ జరుపుకున్నప్పటికీ తెలుగింట పెద్ద పండుగకి మాత్రం ఆయన కూడా దూరమవుతున్నట్టే. ఈ పరిస్థితుల్లో జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. హైవేలు దిగ్భంధించినా, ఎమ్మెల్యేలపై దాడి యత్నం జరిగినా ఆయన స్పందించడం లేదు. చంద్రబాబుని కూడా అరెస్ట్ చేసే వరకూ వెళ్లినా సీఎం మాత్రం చలించడం లేదు. ప్రతిపక్షాలకు కొందరు కీలక నేతలు, సీనియర్ మంత్రులు సమాధానం చెప్పడమే తప్ప జగన్ మాత్రం పెదవి విప్పడం లేదు.
జగన్ నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అమ్మ ఒడి వంటి కీలక పథకాలకు కూడా శ్రీకారం చుట్టారు. ప్రజల ముందుకు వచ్చారు. అయినా రాజధాని అంశాన్ని ఆయన ప్రస్తావించడం లేదు. హైపవర్ కమిటీ రిపోర్ట్, దానిపై చర్చించేందుకు క్యాబినెట్ భేటీ, చివరిగా అసెంబ్లీ సమావేశాలు, వీలయితే అఖిలపక్షం అన్నట్టుగా జగన్ ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో విశాఖలో వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. తాగునీటి కొరత తీర్చేందుకు గానూ పోలవరం విషయంలో పట్టుదల ప్రదర్శిస్తున్నారు. ఇలా వరుసగా తన పనితాను చేసుకుపోవడమే తప్ప ప్రతిపక్షాల తీరు మీద గానీ, తన ప్రభుత్వ విధానం మీద గానీ ఆయన స్పందించకుండా వేచి చూస్తున్న తీరు విపక్షాలకు అర్థంకాకుండా మారింది.
జగన్ వ్యూహాత్మక మౌనం చంద్రబాబు వంటి సీనియర్లకు సైతం అంతుబట్టడం లేదు. రాజధాని మార్పు కోసం సన్నాహాలు చేసుకుంటూ మరోవైపు ఎన్ని విమర్శలు చేసినా ముఖ్యమంత్రి మౌనం వహించడం వెనుక కారణాలు ఎంత శోధించినా తెలియడకపోవడంతో టీడీపీ థింక్ ట్యాంక్ తలలు పట్టుకుంటోంది. జగన్ ఎంత సైలెంట్ గా ఉన్న సమయంలో ప్రతిపక్షం ఎంత పెద్దగా అరచిగీపెట్టినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. దాంతో ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రతిపక్షాల ముందున్న ప్రశ్నగా తయారయ్యింది.