iDreamPost
android-app
ios-app

రైతన్నలకు మేలు చేసేలా జగన్ సర్కార్ కీలక చర్యలు

రైతన్నలకు మేలు చేసేలా జగన్ సర్కార్ కీలక చర్యలు

కరోనా వైరస్ ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ తీసుకుంటున్న చర్యల వల్ల అటు రైతాంగానికి ఇటు వినియోగదారులకు ఎంతో ప్రయోజనంగా ఉంటోంది. లాక్ డౌన్ వల్ల అన్ని కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు సరసమైన ధరల్లో నిత్యావసరాలు, కూరగాయలు పండ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రైతుబజార్ లను ఏర్పాటు చేసింది. ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక రైతు బజార్.. పట్టణాలు, నగరాల్లో ఏర్పాటు చేసింది. తాజాగా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ లో రైతు బజార్లు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్ యార్డ్ గిడ్డంగులు ప్లాట్ఫారంపై కూరగాయలు, పండ్ల విక్రయానికి ప్రభుత్వం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో 216 మార్కెట్ కమిటీలు ఉండగా..150 మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలు అనువుగా..ఇక్కడ కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ తక్కువ ధరకు ఉత్పత్తులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. కూరగాయలు, పండ్లు తక్కువ ధరకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు ఈ చర్యల వల్ల రైతులకు, వినియోగదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుత సమయంలో మార్కెటింగ్ సదుపాయాలు లేక రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అదే సమయంలో వినియోగదారులకు కూరగాయలు, పండ్లు లభించక ఇబ్బంది పడుతున్నారు.

తాజాగా మార్కెట్ యార్డ్ లో ఏర్పాటుచేసిన రైతు బజార్ల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించు కొనేందుకు, ప్రజలు పండ్లు, కూరగాయలు సరసమైన ధరలకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేశామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రైతు బజార్ లను భవిష్యత్తులోనూ కొనసాగించడం వల్ల రైతులకు, వినియోగదారులకు మేలు జరిగే అవకాశం అవకాశాలున్నాయి. ప్రస్తుతం గిడ్డంగులు ఫ్లాట్ ఫారాలపై ఈ పండ్లు కూరగాయల విక్రయాలు చేపడుతున్నా.. భవిష్యత్తులో వీటిని కొనసాగించేందుకు అదనంగా రైతు బజార్లను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల రైతులు దళారుల దోపిడీ నుంచి కూడా బయట పడతారు.