Idream media
Idream media
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత ఆపత్కాలంలో ఆంధ్రప్రదేశ్లోని అన్నదాతలకు జగన్ సర్కార్ అండగా నిలుస్తోంది. ఖరీఫ్ వరి కోతలు ఊపందుకోవడంతో ధాన్యం ఇళ్లకు చేరుతోంది. ఈ నేపథ్యంలో రైతులు తమ పంటనమ్ముకోవడం లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా, నష్ట పోకుండా ఉండేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దాన్యం కొనుగోలు పై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దళారుల వల్ల మోసపోకుండా గ్రామ స్థాయిలోనే ధాన్యం కనీస మద్దతు ధర తెలిసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర ను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రకటించింది. సాధారణ రకం క్వింటాలుకు 1815 రూపాయలు, గ్రేడ్ ఏ కు 1,835 రూపాయలుగా మద్దతు ధరను నిర్ణయించారు.
రాష్ట్రంలో గ్రామాల వారీగా నిత్యం వరికోతలు, విక్రయాలు పర్యవేక్షించాలని పౌర సరఫరాల కార్యదర్శి కోన శశిధర్ సిబ్బందిని ఆదేశించారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం మిల్లులకు చేరవేసేందుకు జిపిఎస్ అమర్చిన వాహనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైతులు ఏమైనా సమస్య ఎదుర్కొంటే టోల్ ఫ్రీ నెంబర్ 1902 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన సామగ్రిని మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు.