ప్రజా స్వామ్యానికి జగన్‌ రక్షక కవచం తొడుగుతున్నారా..?

డబ్బు, మద్యం పంపకం, ప్రలోభాలు, బెదిరింపులు లేకుండా శాంతియుతంగా ఓటు వేయగలిగినప్పుడే ప్రజా స్వామ్యం ఫరిడవిల్లుతుందనేది పెద్దలు చెప్పేమాట. దేశంలో ప్రారంభంలో ఎన్నికలు ఇలానే జరిగేవి. దాదాపు 40 ఏళ్లపాటు నగదు, మద్యం పంపకం అనేవి లేకుండా అన్ని రకాల ఎన్నికలు జరిగాయి. 1990వ దశకంలోనే ఎన్నికల చట్రంలోకి ఈ మహమ్మారిలు ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1995 ఎన్నికల సమయంలో ఇవి ప్రారంభమయ్యాయని పరిశీలకులు చెబుతుంటారు. ఆ ఎన్నికల్లో టీడీపీలోని అభ్యర్థులకు నగదు ఇవ్వడం, ఆ తర్వాత వైశ్రాయ్‌ ఘటన.. ఆ పై సీఎంగా చంద్రబాబు ఎన్నికవడం.. ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడి జరిగాయని చెబుతుంటారు.

దేశంలో అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలో ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారింది. ఇప్పటికీ పారుతోంది. పక్కనే ఉన్న కేరళలో ఇవి మచ్చుకు కూడా కనిపించవంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నడుం బిగించారు. చెడిపోయిన వ్యవస్థను మార్చేందుకు అవకాశం ఇవ్వండంటూ.. ఎన్నికల సభల్లో చెప్పిన విధంగానే.. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే జగన్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో కింది స్థాయి నుంచి ధన, మద్యం ప్రవాహం అడ్డుకునేందుకు పటిష్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని పూర్తిగా అరికట్టేందుకు చట్టంలో మార్పులు చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిపికేషన్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ జారీ చేయనున్నారు. డబ్బు, మద్యం పంచినట్లు తేలితే.. ఎన్నికైన తర్వాత సదరు అభ్యర్థిని అనర్హుడిగా చేయడంతోపాటు, జైలు శిక్ష విధించేలా సదరు ఆర్డినెన్స్‌ ఉంటుందని నిన్న జరిగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు.

చంద్రబాబు ప్రారంభించిన ఓటుకు నోటు అనే విధానం.. మొదట ఎమ్మెల్యేలతో మొదలైంది. ఎన్టీ రామారావు నుంచి పదవిని లాక్కునేందుకు చంద్రబాబు ఎమ్మెల్యేలకు నగదు ఇచ్చారని పరిశీలకులు చెబుతున్న మాట. 21వ శతాబ్ధం వరకు కూడా ఓటర్లకు కొద్ది మేర మద్యం పంచారు కానీ నగదు పంచలేదు. 2004 ఎన్నికల్లో వంద, రెండు వందలతో మొదలైన ఓట్ల కొనుగోలు వ్యవహారం ఆ తర్వాత ప్రతి ఎన్నికల నాటికి శృతి మించింది. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఖర్చు కోటి రూపాయలు ఉండగా గత ఎన్నికల్లో అది 20 నుంచి 30 రెట్లు పెరిగింది. 20 ఏళ్లలో అభ్యర్థి ఖర్చు కోటి రూపాయల నుంచి 20, 30 కోట్లకు చేరిందంటే.. నగదు పంపకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో 500 రూపాయలు, 2014 ఎన్నికల్లో వెయ్యి రూపాయలు పలికిన ఓటు.. 2019 ఎన్నికల నాటికి రెండు నుంచి మూడు వేలకు పెరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు ఐదు వేలు ఇచ్చిన సందర్భాలున్నాయి. ప్రతి ఐదేళ్లకు ఓటు విలువ రెట్టింపువుతోంది.

కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అభ్యర్థి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు వడ్డీతో సహా ఎలా సంపాధించాలన్నదానిపై దృష్టి పెడతారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు నగదును పోగుచేసుకుంటారు. ఈ క్రమంలోనే అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయింపులకు విపరీతంగా నగదు ఖర్చు చేయడమే ప్రధాన కారణం. నగదు పంచడం అనే ఒకే ఒక్క కారణంతో ప్రజా స్వామ్యం కుంటుపడుతోంది. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజా స్వామ్యానికి రక్షక కవచం తొడిగేందుకు సంకల్పించారు. నగదు పంపిణీని అరికట్టడం ద్వారా ప్రజా స్వామం ఏమిటి..? దాని ఫలాలు ఎలా ఉంటాయో నేటి తరానికి చూపించాలనే లక్ష్యంతో ఉన్నారు.

పంచాయతీ నుంచి ఎమ్మెల్యే వరకు ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. గెలిచినా, ఓడినా.. ఇరు పక్షాలకు ఖర్చు తప్పదు. ఈ నేపథ్యంలో ఇరువరు నష్టపోతున్నారు. గత ఎన్నికల్లో 2000 ఓట్లు ఉన్నా పంచాయతీకి 20 లక్షల రూపాలయలు, 4 వేల జనాభా ఉన్న ఎంపీటీసీ స్థానానికి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రూపాయన్నర వడ్డీతో లెక్కించినా ఈ మొత్తం ఐదేళ్లలో రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా ఆర్థికంగా నష్టపోయారు. ఈ పరిస్థితికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టేలా సీఎం జగన్‌ ముందడుగు వేస్తున్నారు. స్థానిక సంస్థలతో మొదలు పెట్టి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి నగదు, మద్యం పంపిణీకి వీలైనంతగా చెక్‌ పెట్టే ఉద్దేశంతో ఉన్నారు.

ఎన్నికల్లో మద్యం, నగదు ప్రవాహం కట్టడికి సీఎం జగన్‌ ఆలోచనలు ఆచరణ సాధ్యమేనా..? అనే అనుమానాలు కొందిరిలో ఉన్నాయి. ఇప్పటికే పరిపాలనలో అసాధ్యం అనుకున్న వాటిని వైఎస్‌ జగన్‌ సుసాధ్యం చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కోట్లరూపాయలు ఖర్చు పెట్టారు. ఇందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఉన్నారు. గెలిచిన తర్వాత రెట్టింపు సంపాదించుకోవచ్చనుకున్న వారి ఆశలు వైఎస్‌ జగన్‌ నిర్ణయాలతో అడియాశలయ్యాయి. రాజకీయ అవినీతిని పూర్తిగా కట్టడి చేశారు. ఇసుక, మద్యం, ఉద్యోగుల బదిలీలకు ముడుపులు.. ఇలా ప్రతి అంశంలో అవినీతిని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులు.. అందరిపీ నిఘా పెట్టారు. అవినీతికి దూరంగా ఉండేలా ముందు తన పార్టీ నుంచే సంస్కరణలు మొదలు పెట్టారు. రాజకీయ అవినీతిని కట్టడి చేయడంలో విజయం సాధించారు. ఆ తర్వాత ప్రభుత్వ కార్యాయాలపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్‌ జగన్‌ ఆలోచన విజయవంతం అవుతుందన్న అంచనాలున్నాయి.

Show comments