iDreamPost
android-app
ios-app

సంక్షేమంలో జగన్‌ సర్కార్‌ మార్క్‌

సంక్షేమంలో జగన్‌ సర్కార్‌ మార్క్‌

ఎన్నికల మెనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లాగా భావిస్తామని ఎన్నికల సభల్లో చెప్పిన సీఎం జగన్‌ ఆ మేరకు తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు. సంక్షేమంలో ఎక్కడా రాజీలేకుండా పథకాలు అమలు చేస్తూ పేద కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు. ప్రభుత్వం తమకు అండగా ఉందనే నమ్మకాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వైద్య భరోసా కల్పిస్తూ ఆరోగ్యశ్రీ కార్డులు ముద్రించి ఇస్తుండగా.. తాజాగా ఈ కోవలోకి పింఛన్‌ కార్డులు చేరాయి.

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ నగదును పెంచింది. రెండు వేలరూపాయలుగా ఉన్న పింఛన్‌ నగదును మూడువేలకు పెంచే భాగంగా.. మొదట 250 రూపాయలు గత ఏడాది మే 30న ప్రమాణస్వీకారం రోజునే సీఎం జగన్‌ పెంచారు. ఆ తర్వాత ప్రతి ఏడాది 250 చొప్పున పెంచుతూ.. పింఛన్‌ నగదును 3 వేల రూపాయలు చేయనున్నారు. పింఛన్‌ పొందే అర్హతలను కూడా జగన్‌ సర్కార్‌ సరళీకరించింది. గతంలో ఐదేకరాలు లోపు పొలం ఉన్న వారికే పింఛన్‌ ఇస్తుండగా.. జగన్‌ సర్కార్‌ ఆ పరిమితిని పదెకరాలకు పెంచింది. వయస్సును 65 నుంచి 60కి తగ్గించింది. ఫలితంగా మరింత మందికి లబ్ధి చేకూరింది.

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ కేటగిరీలను పెంచారు. వృద్ధాప్య, వితంతు, వికాలాంగ పింఛన్లతోపాటు.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా నగదు ఇస్తున్నారు. ప్రస్తుతం 12 విభాగాల్లో జగన్‌ సర్కార్‌ పింఛన్లు మంజూరు చేస్తోంది. ఈ నెల నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో 12 విభాగాల్లో పింఛన్లు తీసుకునే వారి సంఖ్య 54.68 లక్షలకు చేరింది.

వీరందరికీ కొత్తగా పింఛన్‌ కార్డులు మంజూరు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు క్యూర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ కార్డులు రూపొందించింది. కార్డుపై ఓ పక్క జగన్, మరో పక్క వైఎస్సార్‌ చిత్రాలు, లబ్ధిదారులు వివరాలు ముద్రించారు. లబ్ధిదారుని పేరు, గ్రామం / వార్డు, పుట్టిన తేదీ, వయస్సు, ఆధార్‌ నంబర్, ఫోన్‌ నంబర్‌ తదితర వివరాలు కార్డులో పొందుపరిచారు. ఈ స్మార్డ్‌ కార్డు వల్ల వేలి ముద్రలు పడని సమయంలో ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ ద్వారా పింఛన్‌ జాప్యం లేకుండా లబ్ధిదారులకు ఇచ్చే వీలుకలుగుతుంది. పింఛన్‌ కార్డులను ఈ రోజు సోమవారం నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు అందివ్వనున్నారు.