డిజిటల్ సంస్థలకు కనక వర్షం

కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం జనాభా ఇళ్లకే పరిమితం కావడంతో హోమ్ ఎంటర్ టైన్మెంట్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒకప్పటిలా ఇది వీడియో క్యాసెట్, విసిడి, డివిడిల కాలం కాదు. అంతా డిజిటల్ మయం. చేతిలో స్మార్ట్ ఫోన్ లేదా ఇంట్లో వైఫై టీవీ ఉంటే చాలు వరల్డ్ ఎంటర్ టైన్మెంట్ నట్టింట్లోకి వచ్చి పడుతోంది. ఇండియాలో జనానికి ప్రధాన వినోద సాధనం సినిమానే. థియేటర్లు నిరవధికంగా మూతబడటంతో కదలకుండా కూర్చుని వీడియో స్ట్రీమింగ్ యాప్స్ ఓపెన్ చేయక తప్పడం లేదు.

ఈ అవకాశాన్ని ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాయి. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి టాప్ ప్లేయర్ యాప్స్ కి విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి కాస్త వీడియో క్వాలిటీ తగ్గించి లాక్ చేయమని టెలికాం కంపెనీలు రిక్వెస్ట్ చేసే దాకా వచ్చింది పరిస్థితి. హాట్ స్టార్ కూడా గత రెండు మూడు వారాల్లోనే తన సబ్స్క్రైబర్స్ ని ఫుల్ గా పెంచేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే నెటిజన్లు వీటి మీదే ఎక్కువ కాలం గడుపుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు లోకల్ యాప్ ఆహా కూడా వీలైనంత క్యాష్ చేసుకునే ప్రయత్నం గట్టిగానే చేస్తోంది .

కాకపోతే వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం, సినిమాలన్నీ పెద్దగా ఆసక్తి రేపేవి లేకపోవడం కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇక సన్ నెక్స్ట్, జీ 5లు ఉన్నంతలో తమ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాయి. మొత్తానికి సినిమా హాళ్ళు మూసేయడం ఇలా ఓటిటిలకు బాగా కలిసి వచ్చింది. ఇంకో నెలకు పైగా ఇదే పరిస్థితి కొనసాగేలా ఉండటంతో కొత్త కంటెంట్ ని యాడ్ చేయడం మీద అందరూ దృష్టి పెడుతున్నారు. ఒకవేళ వీటికి పబ్లిక్ విపరీతంగా అలవాటు పడినా చిక్కే. రేపు హాళ్ళు తెరిచాక అంత ఈజీగా వాటి వైపు కదలరు. అందులోనూ గత మూడు నెలల్లో మెప్పించినవి నాలుగైదే. సో రానున్న రోజుల్లో పెద్ద సవాలే ఎదురుకాబోతోందన్న మాట వాస్తవం.

Show comments