శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై ఐటి మెరుపు దాడులు

  • Published - 06:20 AM, Wed - 4 March 20
శ్రీచైతన్య, నారాయణ కాలేజీలపై ఐటి మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలలు శ్రీచైతన్య, నారాయణల పై బుధవారం ఉదయం ఐటి శాఖ మెరుపుదాడులు చేసింది. శ్రీచైతన్య, నారాయణ కాలేజీల కార్యాలయాల్లో ఈ ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. గట్టి పోలీసు బందోబస్త్ మధ్య కాలేజీ సిబ్బందిని బయటకు పంపించిన ఐటి అధికారులు కార్యాలయాల్లోని రికార్డులన్నింటిని క్షుణంగా తనిఖీ చేస్తున్నారు.

విజయవాడలోని తాడిగడప, ఈడ్పుగల్లు, బెంజ్ సర్కిల్ సమీపంలోని శ్రీచైతన్య, నారాయణల క్యాంపస్ ల నుండి ఐటి అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం ఐదు గంటల నుండే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ కళాశాలల బ్రాంచ్ ల మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. ప్రత్యేకించి ఐటి రిటర్న్స్ విషయంలో ఉద్దేశపూర్వకంగా అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి భారీగా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్టు ఐటి అధికారులకు ప్రాధమిక సమాచారం లభ్యమైంది.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలైన తరుణంలోనే ఈ కార్పొరేట్ కాలేజీలపై ఐటి దాడులు జరగడం సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయవాడ నగరంలోని క్యాంపస్ లలో మొదలైన ఈ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా బ్రాంచ్ లలో కూడా జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ లో నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా బ్రాంచ్ లు నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ కళాశాలను తక్షణమే రద్దు చేయాల్సిందిగా హైదరాబాద్ హైకోర్టు ఆదేశించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా అనుమతులు లేకుండానే కళాశాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ దాడులపై కాలేజీ యాజమాన్యాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.

Show comments