iDreamPost
iDreamPost
అధికార పక్షంలో విపక్షంలా వ్యవహరించడం గతంలో కాంగ్రెస్ కాలంలో సాధారణం. ఆ తర్వాత టీడీపీ, ప్రస్తుత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అది అరుదైన విషయం. ప్రాంతీయ పార్టీలుగా ఆయా నేతలకు పార్టీ మీద ఉన్న పట్టు రీత్యా తోకజాడించే నేతలకు ఆస్కారం ఉండదు. సుదీర్ఘకాలంగా ఏపీ రాజకీయాల్లో ఇది సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా తెలిసి కూడా ఇప్పుడో ఎంపీ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది. అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తూ చివరకు సొంత పార్టీ ఆదేశాలను కూడా ఆయన ఖాతరు చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే ఓసారి నేరుగా అధినేత సీరియస్ అయ్యే వరకూ వచ్చినప్పటికీ ఆ తర్వాత సర్థుకుందని భావిస్తున్న తరుణంలో తాజాగా నర్సాపురం ఎంపీ తీరు విశేషంగా మారుతోంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి ఏబీఎన్ చానెల్ చర్చల్లో పాల్గొనడమే కాకుండా అక్కడి నుంచి వైఎస్సార్సీపీ రాళ్లేసే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.
కనుమూరి రఘురామకృష్ణం రాజు స్వతహాగా పారిశ్రామికవేత్త. పార్లమెంట్ లో అధ్యక్షా అనాలనేది ఆయన కోరిక. పదేళ్ళుగా ప్రయత్నం చేసినా ఆయనకు టికెట్ కూడా దక్కలేదు. చివరకు పార్టీని మధ్యలో ఓసారి వీడిపోయి, మళ్లీ వచ్చినప్పటికీ జగన్ మాత్రం ఆయనకు అవకాశం ఇచ్చారు. న ర్సాపురం ఎంపీ స్థానం నుంచి టికెట్ దక్కడంతో సునాయాసంగా విజయం సాదించి లోక్ సభలో బెర్త్ దక్కించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎలా వ్యవహరించినప్పటికీ గడిచిన కొన్ని నెలలుగా ఆయన తీరు వైఎస్సార్సీపీ నేతలతో పాటుగా సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా ఏమాత్రం రుచిస్తున్న దాఖలాలు లేవు.
కరోనా మహమ్మారి సమయంలో పలువురు ప్రజాప్రతినిధులు రంగంలో దిగి ప్రజలకు సేవలందించారు. వివిధ రూపాల్లో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కొందరు నేతలయితే ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడిపి వివిధ ఉత్పత్తుల ఎగుమతులకు లైన్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ రఘురామకృష్ణం రాజు మాత్రం వారందరికీ భిన్నంగా వ్యవహరించారు. సొంత నియోజకవర్గం వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఆయన సహచరులు ఏదో మేరకు ప్రజలకు చేదోడుగా నిలుస్తున్నప్పటికీ ఆయన మాత్రం జనాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పైగా మీడియాలో కూర్చుని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధపడుతుండడం విస్మయకరంగా మారుతోంది. విపక్ష నేత చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి జూమ్ లో జగన్ మీద విమర్శలు చేస్తుంటే రఘురామరాజు కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తున్నారు.
చివరకు ఆక్వా హబ్ గా కనిపించే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆక్వా ఉత్పత్తుల విషయంలో కనీసం కూడా స్పందించకపోవడం విమర్శలకు దారితీసింది. భీమవరం, నర్సాపురం ప్రాంతంలో ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్ లేకపోవడం, ఎగుమతులకు లాక్ డౌన్ లో ఏర్పడిన ఆటంకాలు అందరినీ కలవరపరిచాయి. దాంతో చాలామంది ఆక్వా ఉత్పత్తిదారులు పంటను చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. అలాంటి సమయంలో అండగా ఉండాల్సింది పోయి, కనీసం రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు చేదోడుగా నిలిచిన ఆనవాళ్లు కూడా లేవు. స్వయంగా సీఎం జగన్ సమీక్ష జరిపి, ఆక్వా ఉత్పత్తులకు రేట్లు ఫిక్స్ చేసిన తర్వాత కొంత ఉపశమనం దక్కింది. ఎగుమతులకు ఆటంకాలు తొలగించేందుకు ప్రభుత్వ పెద్దలు అష్టకష్టాలు పడి అనుమతులు సాధిస్తున్న సమయంలో కనీస బాధ్యతగా ఈ ఎంపీ సహకారం అందించకపోవడం గమనిస్తే తొలిసారిగా ఎన్నికయిన తర్వాత ఆయన తీరులో వచ్చిన మార్పు స్పష్టం చేస్తోంది.
వాస్తవానికి ఏబీఎన్ చానెల్ లో చర్చలకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ వెళ్లకూడదని ఆపార్టీ నిర్ణయించింది. అలా ఆంక్షలు ఉల్లంఘించిన వెళ్లిన వారిపై చర్యలు కూడా తీసుకుంటామని గతంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రజ్యోతిని నేరుగానే తిరస్కరించిన విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ రఘురామరాజు అదే చానెల్ లో కూర్చుని జగన్ ప్రభుత్వ తీరు మీద విమర్శలకు పూనుకోవడం గమనిస్తుంటే వ్యక్తిగత లక్ష్యంతోనే ఈ ఎంపీ ఉన్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో పార్లమెంట్ సాక్షిగా తెలుగు మీడియం పేరుతో ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చివరకు స్వయంగా వచ్చి సీఎం కి ఆయన సంజాయిషీ ఇచ్చుకునే వరకూ పరిస్థితి వచ్చింది. అయినా తీరు మారకపోగా వైఎస్సార్సీపీ నేతలు, మంత్రుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వ్యాఖ్యానించడం చూస్తుంటే ఈ ఎంపీ వ్యవహారం శృతిమించుతోందనే అభిప్రాయం పాలకపక్షంలో బలపడుతోంది.
అవినీతి పై ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవడం మంచిదే అని ఓ వైపు చెబుతూనే అచ్చెన్న అరెస్ట్ తీరు ని మాత్రం తప్పుబట్టడం అధికార పార్టీ నేతగా ఆయన కొనసాగాలనుకుంటున్నారా లేక విపక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. అక్రమార్కులపై ప్రభుత్వ వైఖరిని ప్రజలంతా హర్షిస్తుండగా, అధికార పార్టీ సభ్యుడిగా ఉన్న నేతకు అది అంతగా రుచించకపోవడం గమనార్హం. అరెస్టు కోసం గోడదూకారని, ఆపరేషన్ చేయించుకున్న వారి పట్ల అలా వ్యవహరించకూడదని, మంత్రులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని చెప్పడం ద్వారా విపక్షం చేస్తున్న వాదనను కాస్త సున్నితంగా వినిపించే యత్నంలో ఈ ఎంపీ ఉన్నారా అనే అనుమానం రాకమానదు.
సన్నాయి నొక్కులతో మొదలు పెట్టి ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని విమర్శలకు కూడా పూనుకున్న ఈయన తీరు ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈఎస్ఐ స్కామ్ లో నిందితుల అరెస్ట్ ని బీజేపీ, సీపీఎం సహా పలు పార్టీల నేతలు ఆహ్వానించారు. అవినీతి విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ కూడా అవినీతి జరగలేదని చెప్పలేకపోయింది. చంద్రబాబు కూడా నేరం అధికారుల మీదకు నెట్టే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో సాగుతున్న చర్చను పక్కదారి పట్టించేలా మంత్రుల మాటల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని రఘురామ రాజు యత్నించడం ఆయన తీరుని చాటుతోంది. జగన్ కి తలనొప్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆయన వ్యవహారం, మాటలు గమనిస్తుంటే ఇలాంటి నేతను వైఎస్సార్సీపీ ఎన్నాళ్లు భరిస్తుందోననే చర్చ కూడా మొదలవుతోంది.