ఖర్చుకి వెనుకాడని కేఎస్ రామరావు నిర్మాత. సినిమా మొత్తం భుజానా మోయగల హీరో విజయ్, ఒకరు కాదు నలుగురు హీరోయిన్లు, సెన్సిబుల్‌గా ఆలోచించే దర్శకుడు క్రాంతి మాధవ్. అయినా వరల్డ్ ఫేమస్ లవర్ ఎందుకు వెనుకబడి ఉన్నాడు అంటే అసలైన హీరో కథ వీక్‌గా ఉండటం.
కాలం మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు మొదటి రోజు ఓపెనింగ్స్ వరకే, సినిమాలో విషయం ఉంటేనే Next Day కలెక్షన్స్. మన లవర్‌లో తీసుకున్న కథ కరెక్టే. ఎందుకంటే Living Together, తర్వాత బ్రేకప్.ఇదంగా యూత్‌కి కనెక్ట్ అయ్యేదే. ఆ తర్వాత కథలో అనేక ఉపకథలు రావడం, అవన్నీ కల్పనలు అనే క్లారిటీ ఉండటంతో ప్రేక్షకుడు డిస్ కనెక్ట్ అయిపోయాడు.
అసలు విజయ్ క్యారెక్టరే గందరగోళంగా ఉంది. రాశి కోసం అతను Jobని వదులుకుంటాడు. రైటర్ కావడం తన యాంబిషన్ అంటాడు. మరి ఏ పని చేయకుండా సోమరిగా ఏడాది పాటు ఎందుకున్నట్టు? ప‌్రతిరోజూ ఆమె ఆఫీస్‌కు వెళ్లి కష్టపడుతుంటే, ఒక యంత్రంలా బెడ్‌పైన ఉంటే గుర్తించలేనంత మొద్ద చర్మమా అతనిది.
ఒంటిపైన కూడా శ్రద్ధ లేకుండా , ఒక నిర్లక్ష్యపు జీవితాన్ని ఎంచుకున్నప్పుడు రాశీ చేసింది కరెక్టే. వదిలేసి వెళ్లిపోయింది. తన పని గుర్తించకుండా వెంటపడి తిడతాడు. Writing అంత ఈజీ జాబ్ అనుకున్నావా అంటాడు.
ఈ రోజుల్లో ఏదీ ఈజీ జాబ్ కాదు. ప్రతి దానికి కష్టపడాల్సిందే. అంత చదువుకున్న విజయ్‌కి , కెరీర్‌లో పైకి రావడం ఎంత కష్టమో తెలియదా? పైగా రైటర్ కావాలని నువ్వు రాసిన కథేంటి? పాతకాలం నాగేశ్వరరావు సినిమా ప్రేమకథ. అవి ఎవరైనా చదువుతారా?
సినిమాలో క్యూట్‌గా ఉన్నది, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది బొగ్గు గని శీనయ్య కథ. దాంట్లో కూడా అనవసరమైన యూనియన్ సీన్స్ పరాయి స్త్రీ వలలో పడిన మొగున్ని తన వైపు తిప్పుకున్న ఇల్లాలి కథ ఇది. కథలో రాశీని హీరోయిన్‌గా కూడా ఊహించడానికి ఇష్టపడని విజయ్, సువర్ణతో ఎందుకు ప్రేమగా లేడు? మళ్లీ స్మిత వెంట ఎందుకు పడ్డాడు? సినిమా అంతా ఈ కన్ఫ్యూజన్ నడవడం వల్ల విజయ్ ప్రేమని మనం ఫీల్ కాం.
ఫ్యారిస్ ఎపిసోడ్‌లో తన కళ్లనే ఇవ్వగలిగిన ప్రేమికుడు, నిజ జీవితంలో రాశిని ఎందుకు గుర్తించలేడు. ఒక దశలో తనది త్యాగం అనుకుంటాడు, తనను వదిలేసి పోయిందని నిందిస్తాడు. ఇంకో దశలో తనదే తప్పని ఏడుస్తాడు. హీరోకి తానేమిటో తనకే తెలియదు. ఇదంతా డైరెక్టర్ సరిగా చేయకపోవడం వల్ల వరల్డ్ ఫేమస్ కావాల్సిన వాడు అన్ పాపులర్ అయ్యాడు.