iDreamPost
android-app
ios-app

టార్గెట్‌ కొడాలి నాని..!

టార్గెట్‌ కొడాలి నాని..!

కొడాలి నాని.. ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పౌర సరఫరాల శాఖ మంత్రి కాకముందే గుడివాడ ఎమ్మెల్యేగా రాష్ట్ర ప్రజానీకానికి సుపరిచితులు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హవాలోనూ, తిరిగి 2009లోనూ టీడీపీ తరఫున గెలిచి ప్రజల దృష్టిని ఆకర్షించారు. సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులుగా పేరొందారు. 2014 ఎన్నికలకు ముందే చంద్రబాబుతో విభేధించి వైఎస్సార్‌సీపీలో చేరారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గుడివాడ నుంచే పోటీ చేశారు. కొడాలిని ఓడించే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు రచించారు. గుడివాడలో బాలకృష్ణను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించాలని కూడా ఆలోచించారు. ప్రత్యర్థి ఎవరైనా సరే.. గెలుపు నాదేనంటూ నాని అప్పట్లో సవాల్‌ చేశారు. 2014 నుంచి 2019 వరకూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వంపై, అప్పటి సీఎం చంద్రబాబుపై ఒంటికాలిమీద లేచేవారు. చంద్రబాబు తీరును అసెంబ్లీలోనే కడిగిపారేసేవారు. కొడాలి టార్గెట్‌గా కృష్ణా జిల్లా నేతలు దేవినేని ఉమా, బొండా ఉమాలు అసెంబ్లీలోనూ, బయటా పని చేశారు. వ్యక్తిగత దూషణలకు దిగారు.

సీన్‌ కట్‌ చేస్తే ఐదేళ్లకు వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ప్రతిపక్షంలో కూర్చుంది. నాని మంత్రియ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబును ఓ ఆట ఆడుకున్న కొడాలి నాని ఇక మంత్రిగా తనదైన స్టైల్లో చడుగుడు ఆడుకుంటున్నారు. అసెంబ్లీలోనూ, బయట ప్రెస్‌మీట్‌లలోనూ చంద్రబాబు విషయం ప్రస్తానకు వస్తే అనర్గళంగా మాట్లాడుతూ ఏకిపారేస్తున్నారు. మంత్రి పదవి ఉన్నా, లేకున్నా తమ నాయకుడు వైఎస్‌ జగన్‌పై ఈగ కూడా వాలనివ్వబోనని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నాని మంత్రి పదవి తనకు కాలిగోటితో సమానమనే రీతిలో సమాధానమిచ్చారు. అధినాయకుడిపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

స్థానిక సంస్థల ఎన్నిలకు వాయిదా పడిన తర్వాత నుంచి కొడాలి నాని కొద్డిగా సైలెంట్‌ ఆయ్యారు. కరోనాపై ఐదుగురు మంత్రులతో వేసిన మంత్రివర్గ ఉపసంఘంలోనూ పౌరసరఫరాల శాఖ మంత్రి అయిన కొడాలి లేరు. కొడాలి ఎందుకు సైలెంట్‌ అయ్యారని అందరూ అనుకుంటున్న తరుణంలో రేషన్‌ కోసం వెళ్లి వృద్ధురాలు మరణించిందన్న ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చారు. వివరణ ఇచ్చి.. మరో వైపు చంద్రబాబు, ఎల్లో మీడియా అంటూ ఓ వర్గం మీడియాపై ఫైర్‌ ఆయ్యారు. కరోనా వైరస్‌కు మందులేదని,.. కానీ ఎల్లో వైరస్‌ అయిన చంద్రబాబుకు జగన్‌ రూపంలో మందు ఉందని తనదైన శైలిలో మాట్లాడారు. ఎల్లో వైరస్‌ అయిన చంద్రబాబును వైఎస్‌ జగన్‌ గొయ్యితీసి పాతేశారని చెప్పారు.

మంత్రి మాటలను ఎడిట్‌ చేసిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానెల్‌.. కరోనా వైరస్‌కు జగన్‌ మందు కనిపెట్టాడంటూ.. సెటైరికల్‌గా పదే పదే చూపిస్తోంది. ఓ వర్గం మీడియాతోపాటు.. సోషల్‌ మీడియాలోనూ కొడాలి నానిని టీడీపీ శ్రేణలు టార్గెట్‌ చేస్తున్నాయి. నాని ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసేలా పోస్టులు పెడుతున్నాయి. అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఈ దాడిని కొడాలి నాని ఏ విధంగా తిప్పి కొడతారో వేచి చూడాలి.