పవన్ ఆదేశించాడు.. రాపాక పాటిస్తాడా??

  • Published - 06:45 AM, Mon - 20 January 20
పవన్ ఆదేశించాడు.. రాపాక పాటిస్తాడా??

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను రెండు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ ద్వారా ఆదేశాలను జారీ చేసారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని పార్టీలోని అన్ని స్థాయిలలో నిర్ణయం తీసుకున్నామని.. దానికి అనుగుణంగానే సభలో వ్యవహరించాలని లేఖలో కోరారు. ప్రభుత్వ పాలన సంపూర్ణంగా అమరావతిలోనే కొనసాగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పార్టీలో జరిగిన సమావేశాలలో ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా 1. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవెలప్మెంట్ రీజియన్ ఆక్ట్ 2020, 2. అమరావతి మెట్రో డెవెలప్మెంట్ ఆక్ట్ 2020 ల బిల్లులను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేసారు.

Read Also: పార్టీ అధ్యక్షుడు అలా.. ఎమ్మెల్యే ఇలా.. చర్యలు ఉంటాయా..?

కాగా మొదటినుండి పవన్ కళ్యాణ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలను సమర్ధిస్తూ వస్తున్న రాపాక వరప్రసాద్ పవన్ కళ్యాణ్ ఆదేశాలను పాటిస్తాడా అన్నది ఇప్పుడు పలువురిలో రేకెత్తుతున్న ప్రశ్న…జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి, మామధ్య ఎలాంటి చర్చలు జరగవని రాపాక వరప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యమంత్రి తీసుకుంటున్న మంచి నిర్ణయాలను సమర్థిస్తానని గతంలో పలుసందర్భాల్లో రాపాక స్పష్టం చేసారు. మొదటినుండి జగన్ నిర్ణయాలను సమర్ధిస్తూ వస్తున్న రాపాక నేడు పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయె బిల్లులను వ్యతిరేకిస్తార? లేక పవన్ ఆదేశాలను మీరి ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా బిల్లులను సమర్థిస్తారా అనేది ఇప్పుడు పలువురిలో కలుగుతున్న సందేహం..

కాగా ఇప్పటికే మూడు రాజధానులకు అనుకూలంగా స్పందిస్తానని రాపాక ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ రాపాక నిర్ణయానికి వ్యతిరేకంగా బిల్లుని తిరస్కరించమని పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో రాపాక ఎలా స్పందిస్తారో అని రాజకీయ వర్గాలతో పాటుగా అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. . ఒకవేళ పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను రాపాక వరప్రసాద్ మీరితే పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Show comments