iDreamPost
android-app
ios-app

Vijetha : అలాంటి క్లాసిక్ కి కొనసాగింపు సాధ్యమేనా

  • Published Nov 24, 2021 | 10:34 AM Updated Updated Nov 24, 2021 | 10:34 AM
Vijetha : అలాంటి క్లాసిక్ కి కొనసాగింపు సాధ్యమేనా

ఏది ఏమైనా టాలీవుడ్ కు సీక్వెల్ ఫీవర్ ఫుల్ గా పట్టేసింది. బాహుబలి మినహాయించి నెంబర్ 2తో వచ్చిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాకపోయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లా మన దర్శకులు వీటిని తీస్తూనే ఉన్నారు. రాబోతున్న వాటిలో పుష్ప, కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. సరే ఇవన్ని కొత్తవి కాబట్టి ఏదో ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఎప్పుడో 36 ఏళ్ళ క్రితం వచ్చిన కల్ట్ క్లాసిక్ సూపర్ హిట్ ని ఇప్పుడు కొనసాగించాలనే ఆలోచన చేయడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. నమ్మశక్యంగా లేకపోయినా మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం.

1985లో చిరంజీవి ఇమేజ్ మంచి పీక్స్ కు వెళ్తున్న సమయం. ఖైదీ దెబ్బకు అప్పటికే ఆయనకు విపరీతమైన మాస్ ఇమేజ్ వచ్చి పడింది. ఆ టైంలో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యేలా ఏదైనా సినిమా చేయాలనే ఉద్దేశంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విజేతలో నటించారు. ఫక్తు ఫ్యామిలీ ఎమోషన్స్, కన్నీళ్లు తెప్పించే సెంటిమెంట్ తో నిండిన ఈ మెలో డ్రామా మంచి విజయం సొంతం చేసుకుంది. చెల్లి పెళ్లి కోసం కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధపడే పాత్రలో చిరు నటన ప్రేక్షకులను కదిలించింది. ఎన్ని ఏళ్ళు గడిచినా ఎమోషనల్ డ్రామాలో దాన్ని మించిన సినిమా ఎవరో ఎందుకు చిరంజీవే తీయలేకపోయారు.

ఇప్పుడు 2021లో విజేత 2 తీస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనకు చిరంజీవి సానుకూలంగా ఉన్నారన్న వార్త అభిమానులను సంతోషంలో ముంచెత్తినా మరోపక్క అనుమానం కూడా రేపుతోంది. అందులో పాతికేళ్ల కుర్రాడిగా నటించిన చిరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారు, ఎలా కంటిన్యు చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, తలైవిలో నిర్మాణ భాగస్వామిగా ఉన్న విష్ణు ఇందూరి దీని మీద చాలా ఆసక్తిగా ఉన్నారట. కథను సిద్ధం చేసి ఆపై దర్శకుడిని నిర్ణయిస్తారని తెలిసింది. ఇదే టైటిల్ తో 2018లో మెగాస్టార్ చిన్నల్లుడు డెబ్యూ చేస్తే అది అంచనాలు అందుకోలేక డిజాస్టర్ కావడం ఈ సందర్భంగా మర్చిపోకూడదు

Also Read : OTT Premiers : సినిమా ప్రేమికులకు చిన్నితెర వినోదం