Rahul Ramakrishna : నమ్మిన వాళ్ళను ఫూల్స్ అనడం హాస్యమా

నిన్న కమెడియన్ రాహుల్ రామకృష్ణ 2022 నటన పరంగా తన చివరి సంవత్సరమని ఇకపై రిటైర్ అవుతున్నానని ట్వీట్ పెట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొన్ని మీడియా సంస్థలు దీన్ని నిజమని నమ్మేసి భారీగా ప్రచారం కూడా కల్పించాయి. తన అధికారిక అకౌంట్ ద్వారానే అతను ఇది చెప్పాడు కాబట్టి అందరూ వాస్తవమనే అనుకున్నారు. కానీ మళ్ళీ సాయంత్రానికి తూచ్ అదేమీ లేదు ఉత్తినే జోక్ చేశానని చెప్పడం కొత్త ట్విస్ట్. మాములుగా చెప్పినా సరిపోయేది. నమ్మినవాళ్ళందరూ ఫూల్స్ అని అర్థం వచ్చేలా కామెంట్ చేయడంతో అభిమానులు సైతం అతని మీద కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. ఇదేం కామెడీ అంటున్నారు.

చూస్తుంటే కేవలం పబ్లిసిటీ కోసమే రాహుల్ రామకృష్ణ ఇదంతా చేసినట్టు కనిపిస్తోంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తున్నా తనకు ఆఫర్లు మరీ తగ్గిపోలేదు. గత ఏడాది జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ కావడంతో రాహుల్ పాత్ర లేదని చెప్పలేం. రాబోయే రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ లో కూడా చేశారు. దర్శకులు వేషాలు ఇస్తూనే ఉన్నారు. అంతా బాగున్నప్పుడు ఇలాంటివి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. పైగా అబద్దమని వివరణ ఇచ్చిన ట్వీట్ లో మంచి జీవితం, సౌకర్యాలు వదులుకుని ఎందుకు వెళ్తానని, స్నేహితులు కంగ్రాట్స్ చెబితే ఆశ్చర్యం వేసిందని ఇలా అర్థం పర్థం లేని లాజిక్ ఏదో రాసుకొచ్చాడు. మొత్తానికి రియల్ లైఫ్ కామెడీ ఇది.

వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో ఈ తరహా గిమ్మిక్కులు గట్టిగానే చేస్తున్నారు. మన గురించి నలుగురు మాట్లాడుకోవాలి అంటే, పేరున్న పత్రికల్లో సైట్లలో మన పేరు రావాలంటే అవసరం లేని వివాదమో, చర్చకు దారి తీసే సందేశమో ఏదో ఒకటి ఇవ్వాలి. అప్పుడే హై లైట్ అవుతాం. గతంలోనూ తన ఓటిటి సినిమా నెట్ విడుదల సందర్భంగా రాహుల్ రామకృష్ణ ద్వందార్థం కూడిన ట్వీట్ ఒకటి పెట్టి దానికి ప్రమోషన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ అదేమీ అద్భుతాలు చేయలేదు. ఉన్న పేరు కాపాడుకోవడమే సవాల్ గా మారుతున్న పరిస్థితుల్లో ఇలా చెడగొట్టుకునే పనులు చేయడం ఏమిటో వీళ్ళకే తెలియాలి

Also Read : Allu Arjun : ఏ భాషలోనూ లాజిక్స్ ఉండవు కదా

Show comments