iDreamPost
iDreamPost
ఏపీలో రాజకీయ వేడిలో మండలి వ్యవహారాలు మంట రాజేశాయి. మరింత ముదురుతున్నట్టు కనిపిస్తున్నాయి. శాసనమండలి రద్దు విషయంలో సీఎం జగన్ తనదైన శైలిలో ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. అదే సమయంలో విపక్షం మాత్రం పట్టు సడలకుండా జాగ్రత్తలు పాటిస్తోంది. ఈ పరిణామాలతో ముగింపు ఏమిటోననే ఉత్కంఠ పెరుగుతోంది. అందుకు తోడుగా సెలక్ట్ కమిటీ విషయంలో మండలి చైర్మన్ మరిన్ని అడుగులు వేశారు. కమిటీకి సభ్యులను సూచించాలంటూ వివిధ పార్టీలకు లేఖలు కూడా రాయడం విశేషంగా మారుతోంది.
శాసనమండలి ఇప్పటికే నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు సభ సాక్షిగా చైర్మన్ ప్రకటించారు. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నట్టు ప్రకటించిన వెంటనే ఆయన చేసిన ఈ ప్రకటనతో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా మండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి, ఆయన స్థానంలో కొత్త చైర్మన్ ని ఎన్నుకోవడమే కాకుండా, సెలక్ట్ కమిటీకి పంపించినట్టు ప్రకటించిన బిల్లులను బేషరుతుగా ఆమోదించాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. మండలి రద్దు జరగకుండా ఉండాలంటే సభలో మెజార్టీ సభ్యులు దానికి సిద్ధపడాల్సి ఉంటుంది. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి సభ్యులు సిద్ధపడితేనే మండలి రద్దు విషయంలో పాలక పక్షం పునరాలోచన చేస్తుందనే సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి.
Read Also: చంద్రబాబుకు షాక్ ఇచ్చిన మరో ఆరుగురు ఎమ్మెల్సీలు.. టీడీఎల్పీలో కీలక నిర్ణయం..
ప్రభుత్వానికి కూడా కేవలం రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి మండలి రద్దు గురించి ఇప్పటికే అసెంబ్లీలో చెప్పినట్టుగా నిర్ణయం తీసుకుని పార్లమెంట్ కి పంపించడం. రెండోది మండలి సమావేశాలకు ఏర్పాట్లు చేసి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడం, ఆ వెంటనే తమకు అనుకూలంగా బిల్లులకు ఆమోదం పొందడం. ఇప్పుడున్న దశలో ప్రభుత్వానికి రెండోది అంత సులువు కాదు. ప్రస్తుతం సభలో ఉన్న బలాల ప్రకారం వైసీపీకి కేవలం 9 మంది సభ్యులున్నారు. ఇద్దరు బీజేపీ, ఆరుగురు పీడీఎఫ్ సభ్యులు కూడా విపక్ష టీడీపీ వైఖరితో విబేధిస్తున్న తరుణంలో తటస్థులుగా మారే అవకాశం ఉంది. మూడు ఖాళీలు కూడా ఉండడంతో సభలో ప్రభుత్వం అనుకున్నది జరగాలంటే 23 మంది సభ్యులు కనీసంగా అవసరం అవుతారు. ఇప్పటికే టీడీపీ కి చెందిన ఇద్దరు ఆపార్టీ తీరుని వ్యతిరేకించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా వ్యవహారం కూడా పెండింగ్ లో ఉంది. దాంతో వారు ముగ్గురు కలిసి వస్తారని అంచనా వేసినా ఇంకా పది మంది వరకూ టీడీపీ ఎమ్మెల్సీల సహకారం అవసరం ఉంటుంది.
తాజాగా టీడీపీ ఎల్పీ మీటింగ్ కి ఆరుగురు ఎమ్మెల్సీలు ఢుమ్మా కొట్టారు. అందులో కొందరు పార్టీకి సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. కానీ వాస్తవానికి సమావేశానికి హాజరయిన వారిలో కూడా కొందరు వైసీపీ క్యాంప్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పది మంది ఎమ్మెల్సీలు పక్క చూపులు చూస్తున్నట్టేనా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ పదిమంది సిద్ధపడితే దానికి జగన్ అంగీకరిస్తారా అనేది పలువురు సమాధానం చెప్పలేని అంశంగా ఉంది. టీడీపీ నేతలు మాత్రం ఇప్పటికే బాహాటంగా బేరసారాలను ప్రస్తావిస్తున్నారు. భారీ ప్యాకేజీ ఆఫర్ చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీ చెబుతున్నట్టు వైసీపీ జంపింగ్ లకు గాలం వేస్తుంటే మాత్రం మండలి రద్దు కన్నా తన దారికి తెచ్చుకునే దిశలోనే ఉన్నట్టుగా భావించాలి. వైసీపీ మాత్రం తన వైఖరి వెల్లడించకుండా క్యాబినెట్ భేటికి, ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలకు సన్నద్దమవుతున్నారు.
Read Also: మండలి రద్దుకు కేబినెట్ ఆమోదం
క్యాబినెట్ భేటీ సమయానికి సంఖ్య సరిపోతుందా లేదా అన్నదే వైసీపీ నేతలు కొందరు లెక్కల్లో మునిగి ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవులపై పలువురు వైసీపీ నేతలు కూడా ఆశాభావంతో ఉన్నారు. వచ్చే ఏడాది నాటికి ఖాళీలయ్యే స్థానాల్లో తమ ఆశలు నిండుతాయని లెక్కలేస్తున్న దశలో రద్దు ప్రతిపాదన ముందుకు రావడంతో వారంతా కలత చెందుతున్నారు. దాంతో మండలిని కాపాడుకోవడానికి పలువురు వైసీపీ నేతలు కూడా కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అలాంటి నేతలంతా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలతో చర్చలు జరుపుతున్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కూడా ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు కలిసినప్పటికీ తమ వైఖరి మారదని, ఆధిపత్య రాజకీయాలకు మండలిని వేదిక చేయడానికి తాము సహకరించమని వారు తేల్చేసినట్టు చెబుతున్నారు. దాంతో టీడీపీ ఎమ్మెల్సీలతో జరుపుతున్న రాయబారాల మీద అలాంటి నేతలంతా గంపెడాశతో ఉన్నారని సమాచారం.
Read Also: బంతి బీజేపీ కోర్టులోకి..!
నేడు ఉదయం జరగబోయే క్యాబినెట్ భేటీ మీద ఇప్పుడు అందరి దృష్టి పడింది. సమయం ముంచుకొస్తున్న కొద్దీ వివిధ వర్గాల్లో కలవరం పెరుగుతోంది. అందరికీ సమాధానం జగన్ వద్ద మాత్రమే ఉందని దాదాపుగా భావిస్తున్నారు. అయితే జగన్ కి తగిన రీతిలో ధీమా లభిస్తుందా లేక ఆయన తాను అనుకున్న దిశలో సాగిపోతారా అన్నదే తేలాల్సి ఉంది. ఏం జరిగినా అది ఏపీ రాజకీయాల్లో కొత్త వేడి రాజేయడం ఖాయం గా చెప్పవచ్చు.