iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం మరో అడుగు వేస్తోంది. గత ప్రభుత్వ హయంలో జరగిన పలు అక్రమాలపై ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. పలు కేసులు కూడా నమోదు చేసి మాజీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు మీద విచారణకు సన్నద్ధమవుతోంది. దానికి తోడుగా కీలకమైన మాన్సాస్ ట్రస్ట్ లో కూడా మరో కుంభకోణం వెలికి తీస్తున్నట్టు కనిపిస్తోంది. మహాముదురు నడిపిన మరో వ్యవహారం బయటపడే అవకాశం స్పష్టంగా ఉందని తెలుస్తోంది. దాంతో టీడీపీతో పాటుగా బీజేపీ నేతల్లో కూడా కలకలం మొదలయ్యిందనే ప్రచారం సాగుతోంది.
విజయనగరం గజపతుల ఆధ్వర్యంలో 1958లో మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. భూ పరిమితి చట్టం అమలులోకి వస్తున్న నేపథ్యంలో అప్పట్లో పీవీజీ రాజు ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ల్యాండ్ సీలింగ్ కారణంగా ఏపీలోని 104 దేవస్థానాల పేరుతో రాజా వారి భూములను రాసి, వాటన్నింటి నిర్వహణకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గజపతుల వారసులు ఈ ట్రస్ట్ నిర్వహణలో ఉన్నారు. పీవీజీ రాజు అనంతరం ఆనందగజపతిరాజు ట్రస్ట్ బాధ్యతలు స్వీకరించారు. 2016లో ఆనంద గజపతి మరణానంతరం ఆయన స్థానంలో అప్పటి కేంద్రమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు చైర్మన్ అయ్యారు. జీవో నెంబర్ 138 ద్వారా ఆయన బాధ్యతలు స్వీకరించడమే కాకుండా, జీవో నెంబర్ 139 ద్వారా టీడీపీ ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరించిన చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ వైద్య విధాన పరిషత్ మాజీ వీసీ ఐవీ రావుని కూడా ట్రస్ట్ డైరెక్టర్లుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. మరుసటి ఏడాది 2017లో అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుని కూడా ట్రస్ట్ లో సభ్యురాలిగా చేర్చారు. కానీ ఆనంద గజపతిరాజు కుటుంబం నుంచి ట్రస్ట్ లో ఎవరికీ అవకాశం ఇవ్వలేదు
అదే సమయంలో చెరుకూరి కుటుంబరావుకి ఆ ట్రస్ట్ కి ఏవిధమైన సంబంధం లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడమే అప్పట్లో ఆశ్చర్యకరంగా కనిపించింది. అసలు వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 మంది ట్రస్ట్ సభ్యులకు అవకాశం ఉన్నప్పటికీ అప్పట్లో ఏడుగురికే చంద్రబాబు సర్కారు పరిమితం చేయగా, తాజాగా జగన్ ప్రభుత్వం మాత్రం కొత్తవారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధపడింది. అందులో భాగంగా పీవీజీ రాజు కుమార్తె సునీత తో పాటు ఆనంద గజపతిరాజు కుమార్తె ఊర్మిళకు కూడా ట్రస్ట్ లో అవకాశం కల్పించింది. అదే సమయంలో చంద్రబాబు హయంలో తొలగించిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలకు కూడా ట్రస్ట్ లో సభ్యులుగా మారే అవకాశం ఇచ్చింది. అందులో భాగంగా విజయనగరం ఎంపీ, ఎమ్మెల్యేలకు ప్రవేశం దక్కింది.
ఈ పరిణామాలతో పలు వ్యవహారాలు బయటపెట్టేందుకు మార్గం సుగమం అయ్యిందని చెబుతున్నారు. ముఖ్యంగా ట్రస్ట్ కి సంబంధించిన భూముల విషయంలో జరిగిన మతలబు బయటపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే సుమారుగా 2వేల ఎకరాలు చేతులు మారినట్టు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టు చెబుతున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న 13,874 ఎకరాలకు గానూ జరిగిన భూభాగోతం పూర్తి వివరాలు సేకరించే పని సాగుతున్నట్టు సమాచారం. అదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ భూసేకరణలో కూడా మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించిన భూముల పేరుతో కొందరు టీడీపీ నేతలు నష్టపరిహారం స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.
ట్రస్ట్ కి చేరాల్సిన నిధులను కొందరు ట్రస్ట్ సభ్యులే పక్కదారి పట్టించారనడానికి కీలక ఆధారాలు లభ్యమయినట్టు తెలుస్తోంది. దాంతో ఈ వివరాలతో విచారణకు జగన్ ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా చైర్మన్ విషయంలో హఠాత్తుగా నిర్ణయం తీసుకుని అశోక్ కి ఉద్వాసన పలికినట్టు భావిస్తున్నారు. సంచయిత కి సారధ్య బాధ్యతలు అప్పగించిన తరుణంలో ఆమె ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, ఆవెంటనే దర్యాప్తకి ప్రభుత్వం రంగంలో దిగబోతోందని తెలుస్తోంది. ఈ విషయంలో కొందరు బీజేపీ పెద్దల పాత్ర కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. అప్పట్లో విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు శాఖకి సంబంధించిన ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం భూసేకరణ జరిగితే నిధుల విషయంలో గోల్ మాల్ జరిగిందనే విమర్శలున్నాయి. మాన్సాస్ ట్రస్ట్ భూములను కూడా ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ కోసం సేకరించిన సందర్భంగా నష్టపరిహారపు నిధులను అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్న ట్రస్ట్ కి కాకుండా పక్కదారి పట్టనట్టుగా అప్పట్లోనే పలువురు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. నాటి ప్రభుత్వం వాటిని ఖాతరు చేయలేదు. అశోక్ పట్టనట్టే వ్యవహరించారు.
కానీ ప్రస్తుతం అధికార మార్పిడి తర్వాత భూములు, నిధుల విషయంపై దృష్టి పెట్టడంతో విషయం హాట్ టాపిక్ అవుతోంది. దాంతో ట్రస్ట్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, అప్పట్లో చక్రం తిప్పిన వారిలో కొందరికి ఇది లేదని సమాచారం. మొత్తంగా మాన్సాస్ లో తవ్వకాలు మొదలయితే భారీ అక్రమాలు బయటపడతాయనడంలో సందేహం లేదని, చివరకు అది టీడీపీ, బీజేపీ నేతల మెడకు చుట్టుకుంటుందనే వాదన కూడా ఉంది. ఇప్పటికే పలు అవినీతి భాగోతాలు బయటపడిన తరుణంలో మరో భారీ వ్యవహారం తోడు కావడం విశేషంగానే చెప్పవచ్చు.