భారత్ – ఐర్లాండ్ నడుమ టీ20 మ్యాచ్ లు మొదలైన సంగతి తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిచినప్పటికీ, మరో మ్యాచ్ లో మాత్రం కష్టపడాల్సి వచ్చింది. రెండో టీ20లో దాదాపు గెలిచినంత పని చేసిన ఐర్లాండ్.. మేము పసికూనలం కాదని తెల్చేసింది.
ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో 4 పరుగుల తేడాతో విజయం సాధిం చి 2-0 సిరీస్ ను కైవసం చేసుకున్నా, ఐర్లాండ్ మాత్రం తన పోరాట పటిమతో క్రీడాభిమానుల మనసుల్ని గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. దీపక్ హుడా మెరుపు ఇన్నింగ్స్ తో 57 బంతుల్లోనే 104 పరుగులు చేయగా, సంజు శాంసన్ 77 పరుగులతో అదరగొట్టాడు.
అనంతరం 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అయితే ఏ మాత్రం అంచనాలు లేనప్పటికీ స్టిర్లింగ్, బాల్ బిర్నీలు తమ బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక దశలో మ్యాచ్ గెలిచేస్తారేమో అనేంత ఉత్కంఠతను కలిగించారు. అసలు ఈ మ్యాచ్ చూసిన వారు ఇక ఐర్లాండ్ చిన్న జట్టు అంటే ఇక ఒప్పుకోరు మరి.