Idream media
Idream media
దేశంలో వివిధ కోర్టుల్లో కొంత మంది న్యాయమూర్తులు తీసుకుంటున్న నిర్ణయాలు వల్లనే ఆరోపణలు వస్తున్నాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థ పట్ల అసహనం పెరుగుతున్నదనీ, ఇది సామాజిక మాధ్యమాల ద్వారా అధికంగా ఉందని అన్నారు. పలువురు జడ్జిలు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి వారిపై ఆరోపణలు వస్తున్నాయనీ, ఈ విమర్శలు కొంత పరిమితిని దాటితే అది న్యాయ వ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
”విమర్శలు కూడా సమాచారం కిందకే వస్తుంది. అయితే దానికి సరిహద్దులు ఉండాలి. ఆ విమర్శలు అనేది తప్పుడు సమాచారం దిశగా సాగితే.. అది ఈ వ్యవస్థకు మంచిది కాదు. ప్రతి వ్యవస్థపై అపనమ్మకం వ్యక్తం చేసుకుంటూపోతే..ఇక వ్యవస్థ అనేది ఉండదు. అరాచకం మాత్రమే ఉంటుంది” అని కౌల్ అభిప్రాయపడ్డారు.
మద్రాస్ బార్ అసోసియేషన్, ఎంబిఎ అకాడమీ ఆధ్వర్యంలో ” కోవిడ్-19 సమయంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, నకిలీ వార్తలు, తప్పుడు సమాచారం (ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్-19, ఫేక్ న్యూస్ అండ్ మిస్ ఇన్ఫర్మేషన్)” అనే అంశంపై జరిగిన సదస్సులో ఆన్‌లైన్ ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో వలస కార్మికుల సంక్షోభాన్ని సుమోటాగా కేసు స్వీకరించిన ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సభ్యునిగా ఉన్నారు. ఈ కేసుపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ”అధికారులను నిందించే న్యాయమూర్తులకు మాత్రమే తటస్థ న్యాయమూర్తులగా ప్రజలు సర్టిఫికెట్లు ఇస్తారు” అని మెహతా అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడే స్వేచ్ఛను పరిమితం చేయకుండా సోషల్ మీడియాను నియంత్రించడం సాధ్యం కాదని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. దేశంలో కరోనా ప్రవేశానికి ముందే నకిలీ వార్తలు తీవ్రతరం అయ్యాయనీ, కొన్ని గుర్తించదగిన సమూహాలకు వ్యతిరేకంగా శత్రుత్వాన్ని సృష్టించాయని వ్యాఖ్యానించారు.
కరోనా సమయంలో వైరస్ మూలం, నివారణలు, వ్యాప్తి కారకులైన వారంటూ సామాజిక మాధ్యమాల్లో సమాచారం పలు రూపాల్లో ప్రచారం జరిగిందనీ, వీటిల్లో కొన్ని మతపరంగా, జాతిపరంగా కూడా ఉన్నాయని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లోకి ఈ సమాచారం ఎలా వస్తుంది ? ఎలా వ్యాపిస్తుందన్నది ? తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం జరగడం లేదని తెలిపారు. ఈ విధంగా సోషల్ మీడియాల్లో వస్తున్న మెసేజ్‌లు అనాలోచితంగా మరొకరికి పంపించటం వలన భయాందోళనలు, విద్వేషాలు పెరుగుతున్నాయని అన్నారు.