iDreamPost
android-app
ios-app

మే 11 నుంచి ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్

మే 11 నుంచి ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్

ఆంధ్రప్రదేశ్‌లో మే 11 నుండి ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు 5,46,162 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,18,280 మంది చొప్పున మొత్తంగా 10,64,442 విద్యార్థులు హాజరయ్యారని మంత్రి సురేశ్‌ తెలిపారు.వీరికి సంబంధించి సుమారు 60 లక్షల పేపర్‌లను మూల్యాంకనం చేయాల్సి ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వివరించారు.

ముందుగా ఆరెంజ్, గ్రీన్ జోన్‌లలో సుమారు 15 వేల మంది అధ్యాపకులతో మే 11 నుండి ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను చేయనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత రెడ్‌జోన్‌లో 10 వేల మంది సిబ్బందితో మూల్యాంకన ప్రక్రియను చేస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలు అనుసరించి, కోవిడ్-19 జాగ్రత్తలను పాటిస్తూనే మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు.మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనే అధ్యాపకులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేయాలని బోర్డు అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలలో ప్రత్యేకంగా గుర్తించిన రెండు,మూడు భవనాలను మూల్యాంకన ప్రక్రియకు వినియోగిస్తున్నట్లు తెలియజేశారు.మూల్యాంకన ప్రక్రియ ముగిసేదాకా కేటాయించిన భవనాల్లో సిబ్బందికి కావలసిన వసతి,భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. మూల్యాంకన ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రతిరోజూ ఉదయం 8 గం.ల నుండి మధ్యాహ్నం 1 గం. వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 1 గం. నుండి సాయంత్రం 6 గం.ల వరకు మరో షిఫ్ట్ లో మూల్యాంకన ప్రక్రియ జరుగుతుందన్నారు. ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబుపత్రాలు చొప్పున ప్రతి రోజు 30 ఆన్సర్ షీట్‌లను మూల్యాంకనం చెయ్యాలని అధికారులకు మంత్రి సురేష్ సూచించారు.

ఇప్పటికే ఈసెట్, ఐసెట్, ఎంసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్‌, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించిందని మంత్రి సురేశ్‌ గుర్తు చేశారు. ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు కావడంతో త్వరితగతిన ఇంటర్మీడియట్ మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి బాధ్యత తమపై ఉన్నట్లు విద్యా శాఖ మంత్రి వివరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో స్పాట్ వాల్యుయేషన్‌లో పాల్గొనే అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని మంత్రి సురేష్ భరోసానిచ్చారు.