iDreamPost
android-app
ios-app

ఏపీలో వేగం పుంజుకుంటున్న పారిశ్రామిక ప్రగతి

ఏపీలో వేగం పుంజుకుంటున్న పారిశ్రామిక ప్రగతి

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కారు సాగునీటి సదుపాయం, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పరిశ్రమలను ఇప్పుడు వేరు వేరు ప్రాంతాల్లో నెలకొల్పే దిశలో అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఇండ్రస్టియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ నిధులతో 5 మల్టీ ప్రొడక్ట్‌ పార్కులను అభివృద్ధి చేయనుంది. విశాఖ – చెన్నై, చెన్నై- బెంగళూరు, హైదరాబాద్‌ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో పారిశ్రామిక పార్కులను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. విశాఖ – చెన్నై ఇండస్ట్రీయల్ కారిడార్ లో నక్కపల్లి, శ్రీకాళహస్తి, కొప్పర్తి; చెన్నై- బెంగళూరు కారిడార్‌లో కృష్ణపట్నం; హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్ లో ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ఏర్పాటుచేయనుంది. 42,313 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు.

తొలిదశలో భాగంగా కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు అభివృద్ధి కోసం నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ 1,314 కోట్లు మంజూరు చేసింది. తరువాత దశలో అదేవిధంగా శ్రీకాళహస్తిలో 2,500 ఎకరాల్లో, కొప్పర్తిలో 2,596 ఎకరాల్లో, నక్కపల్లిలో 3,196 ఎకరాల్లో పార్కులను అభివృద్ధి చేయడానికి నిధులను సమకూర్చనుంది. పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్, నీటి సదుపాయం మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరోవైపు వైఎస్సార్ జిల్లాలో నాలుగు భారీ ప్రాజెక్టులకు పునాదులు వేయనుంది ప్రభుత్వం. తద్వారా భారీ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధిని రూపుమాపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. 4,025.68 ఎకరాల్లో 35,090 కోట్ల పెట్టుబడులతో ఏర్పడనున్న ప్రాజెక్టుల పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల దాదాపు 3.5లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది.

వైస్సార్ జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌ పనులను ఈ నెల 24న ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 3,164.46 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ మెగా ఇండ్రస్టియల్‌ హబ్‌ ద్వారా 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే లు ప్రముఖ కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 801 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న వైఎస్సార్‌ ఎల్రక్టానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ క్లస్టర్ ద్వారా కనీసం 10వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు.

పులివెందులలో ఇంటిలిజెంట్‌ సెజ్‌ పాదరక్షల తయారీ కేంద్రం, ఆటోనగర్‌ పార్కులకు సైతం 24వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అపాచీ ఫుట్ వేర్ శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో ఏర్పాటు చేసే ఇంటిలిజెంట్‌ సెజ్‌ యూనిట్‌కు అదనంగా పులివెందులలో కాంపోనెంట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఏపీఐఐసీ పులివెందులలో 32.22 ఎకరాల్లో ఆటోనగర్‌ పార్కును అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల మరో నాలుగువేల మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. మొత్తంగా నాలుగు భారీ ప్రాజెక్టులతో వైఎస్సార్ జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోనుందని స్థానికులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు కల్పించడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకుంటోంది. తాజా ప్రాజెక్టులతో ప్రాంతాల మధ్య అసమానతలు తొలిగి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని నిపుణులు అంచనా.