iDreamPost
iDreamPost
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిలా వ్యాప్తించిన కరోనా వైరస్ ఇప్పటికే వేలమందిని బలి తీసుకుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు దేశాలు అనేక చర్యలు చేపట్టాయి. దేశాలకు దేశాలే లాక్ డౌన్లు ప్రకటించాయి. రవాణ వ్యవస్థలను స్థంబింప చేశాయి. అయితే అప్పటికే అన్ని దేశాల్లోకి అడుగు పెట్టిన కరోనా వైరస్ కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పించడం ఒక్కటే మార్గం అని గ్రహించిన ప్రభుత్వాలు ప్రకటనల రూపంలో ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా ఇండోనేషియా ప్రభుత్వం ప్రజల్లో మరింత అవగాహన కల్పించటానికి, విలేజ్ స్క్వాడ్ పేరు తో వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్దం చేసుకుంది. ఇప్పటికే ఇండోనేషియాలో 1200 మందికి సోకి 122 మందిని బలితీసుకున్న కరోనా వైరస్ ని కట్టడి చేయాలంటే ప్రజల్లో మరింత అవగాహన పెంచడంతో పాటు వ్యాది సోకిన వారిని మరింత త్వరగా గుర్తించి వారికి తగిన సమయంలో వైద్య సేవలు అందించి ఇతరులకు సోకకుండా చూసేందుకు ఈ వ్యవస్థను ఉపయోగించబోతునట్టు ఆ దేశ అధికారులు తెలిపారు .
ఇప్పటికే వైరస్ కట్టడికి బ్రిటన్ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఇండొనేషియా ప్రభుత్వం కూడా ఇదే నిర్ణయం తీసుకోవడంతో వాలంటీర్ల వ్యవస్థ పని తీరు పై అన్ని దేశాలు దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవస్థను రాష్ట్రంలో ఆగస్టు 15న ముఖ్యమంత్రి వై.యస్ జగన్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.