iDreamPost
android-app
ios-app

ఐక్య రాజ్య సమితి ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

ఐక్య రాజ్య సమితి ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి తాత్కాలిక స‌భ్య‌త్వపు ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. జూన్ 17న (బుధవారం) జరిగిన ఎన్నికల్లో  ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో భారత్‌కు మరోసారి తాత్కాలిక సభ్యదేశ హోదా లభించింది. 184 ఓట్లతో భారత్ విజయం సాధించింది.

దీంతో 2021 జనవరి 1 నుంచి రెండేళ్ల పాటు భారత్ కొనసాగనుంది.‌ ఐరాసలో సభ్య దేశంగా భారత్ ఎంపిక కావడం ఇది ఎనిమిదో సారి. 55 మంది సభ్యులున్న ఆసియా–పసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ఒక్కటే పోటీ చేసింది. 184 మంది భారత్ కు అనుకూలంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించగా, కెనడా ఓటమిపాలైంది.

ఐక్య రాజ్య సమితిలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాలపై ఆంక్షలు విధించే అధికారం ఉంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్యదేశాలు ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్య దేశాలు ఉన్నాయి. 

శాశ్వత సభ్య దేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వ సభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్య దేశాల ఆమోదం అవసరం. అయితే ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్య దేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం వ్యతిరేకించి వీటో చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. కాగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా, చైనా అందుకు మోకాలడ్డుతోంది.