iDreamPost
android-app
ios-app

కరోనా పై పోరులో కీలక ముందడుగు.. దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం..

కరోనా పై పోరులో కీలక ముందడుగు.. దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం..

కరోనా పై పోరులో భారతదేశం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. రోజులు గడిచే కొద్దీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ల్యాబ్లు ఏర్పాటు పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ తన సేవలను అందించనుంది. డి ఆర్ డి ఓ సంస్థ, ఈఎస్ఐ ఆస్పత్రి సౌజన్యంతో మెయిల్ అనుబంధ సంస్థ ఐకాన్ ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను రూపకల్పన చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్ మధుసూదన్ రావు కీలక పాత్ర పోషించారు.

ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా బాధితులకు నిర్ధారణ పరీక్షలు చేయడంతోపాటు కరోనా వైరస్ పై పరిశోధన కూడా ఈ ల్యాబ్లో చేయవచ్చు. ఈ మొబైల్ వైరాలజీ ల్యాబ్ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పట్టణ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లు ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంయుక్తంగా ప్రారంభించారు. ల్యాబ్ ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు ఈ సందర్భంగా నేతలు అభినందనలు తెలియజేశారు.

కరోనా వైరస్ నియంత్రణకు గరిష్టంగా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు వైరాలజీ ల్యాబులు చేసుకుంటున్నాయి. కరోనా వైరస్ రాకముందు దేశంలో ప్రతి రాష్ట్రంలో ఒకటి అరా మాత్రమే వైరాలజీ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగవంతంగా ఫలితాలు వచ్చే విధంగా నిర్ధారణ పరీక్షల పై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 21 వేలకు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అనుమానీతులకు గరిష్టంగా పరీక్షలు నిర్వహించి.. వైరస్ లింక్ కట్ చేయడం ద్వారా ఈ మహమ్మారిని నియంత్రణలోకి తీసుకురావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.