భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మే 3 వరకూ లాక్ డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే.. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
భారత్ లో లాక్ డౌన్ పొడిగింపుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది.
కరోనా కట్టడికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడింది. భారత్ లో లాక్ డౌన్ పొడిగించడాన్ని డబ్ల్యూహెచ్‌ఓ దక్షిణాసియా ప్రాంతీయ డైరక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్వాగతించారు. సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని,దానితో పాటుగా కరోనా లక్షణాలు ఉన్నవారిని సులువుగా గుర్తించడానికి వీలవుతుందని వెల్లడించారు.
కాగా భారత్ లో నేటినుండి 19 రోజులపాటు రెండో దశ లాక్ డౌన్ కొనసాగనుంది. గతంలో మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు తొలిదశ లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు.