Idream media
Idream media
కాదేదీ కవితకు అనర్హం అన్నారు ఓ మహాకవి. విషయం ఏదైనా రాజకీయానికి కాదు అనర్హం అని నిరూపిస్తున్నారు దేశంలోని రాజకీయ పార్టీల నేతలు. రాజకీయ ప్రత్యర్థులపై, ప్రభుత్వాలపై విమర్శలు చేసేందుకు కొంతమంది పొరుగుదేశాల పరిస్థితిని కూడా వినియోగించుకుంటున్నారు. ఆయా దేశాలతో స్థానిక ప్రభుత్వాలను పోల్చుతూ విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటక రంగం దెబ్బతినడంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి క్షీణించింది.ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర సరుకులు లభించని పరిస్థితి ఆ దేశంలో నెలకొంది. విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో సరుకులు దిగుమతి చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
శ్రీలంక పరిస్థితిని గుర్తుచేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో శ్రీలంక పరిస్థితే భారత్‌లో కూడా వచ్చే అవకాశం ఉందంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీ సర్కార్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ తరహా వ్యాఖ్యలు మమతా చేయడంతో.. వెంటనే కౌంటర్ ఇచ్చిన బీజేపీ నేతలు.. దీదీ ముందు రాష్ట్రంపై దృష్టి పెట్టాలంటూ సూచనలు ఇస్తున్నారు. ఒక వేళ బెంగాల్ ప్రత్యేక దేశం అయి ఉంటే ఈ పాటికి శ్రీలంక కన్నా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొనేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మంజుదర్ విమర్శలు చేశారు.
జాతీయ స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ శ్రీలంక దేశంతో పోలికల రాజకీయం నడుస్తోంది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా దానితో వైసీపీ సర్కార్‌ను ముడిపెట్టి విమర్శలు చేసే టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా శ్రీలంక పరిస్థితిని తన రాజకీయానికి వాడుకుంటున్నారు. ఏపీ పరిస్థితి శ్రీలంక మాదిరిగా తయారైందంటూ ఆయన విమర్శలు చేస్తున్నారు. బాబు ఆలోచనలకు అనుగుణంగా టీడీపీ అనుకూల మీడియా అక్షరాలను ఆ దిశగా కూర్చుతోంది. మూడేళ్ల క్రితం వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఆ సమయంలో కోవిడ్ వంటి విపత్కరమైన పరిస్థితులు లేకున్నా.. రుణ పరిమితికి మించి అప్పులు చేశారు. 2019లో దిగిపోయే ముందు ఖాళీ ఖజానాను అప్పగించారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏపీ ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేస్తూ.. రాష్ట్రాన్ని శ్రీలంకతో పోల్చుతున్నారు. తన కలల రాజధాని అమరావతిని.. శ్రీలంక రాజధాని కొలంబో తరహాలో నిర్మిస్తామంటూ నాడు పలికిన మాటలు చంద్రబాబు మరిచిపోయి ఉంటారేమో..!