Idream media
Idream media
మాంగానుయ్‌లోని బే ఓవల్ వేదికపై జరిగిన చివరి మూడో వన్డేలో భారత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలిచిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ ను క్లీన్‌స్వీప్ చేసింది. టీ20ల్లో 5-0 తేడాతో టీమిండియా చేతిలో వైట్‌వాష్ గురైన కివీస్ వన్డే సిరీస్ లో 3-0 తేడాతో భారత్ ను క్లీన్ షేవ్ చేసి బదులు తీర్చుకుంది.1989 తర్వాత తొలిసారిగా మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో వైట్‌వాష్ గురై అప్రతిష్ఠ పాలయింది.
జట్టుకు శుభారంభం అందించిన కివీస్ ఓపెనర్లు:
297 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఓపెనర్లు మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోలస్ శుభారంభాన్ని అందించారు. మార్టిన్ గప్తిల్ ఆరు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో వేగంగా 46 బంతుల్లో 66 పరుగులు సాధించగా,మరో ఓపెనర్ హెన్రీ నికోలస్ 9 ఫోర్లతో 103 బంతుల్లో 80 పరుగులు చేసి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు.వీరిద్దరూ తొలి వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.17 ఓవర్లలో చాహల్ బౌలింగ్‌లో తొలి వికెట్ గా మార్టిన్ గుప్తిల్ క్లీన్ బౌల్డ్ కాగా,శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కీపర్ రాహుల్ క్యాచ్ పట్టగా నికోలస్ వెనుదిరిగాడు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ విలియమ్సన్(22), తొలి రెండు వన్డేల్లో టీమిండియాను విజయానికి దూరం చేసిన రాస్ టేలర్(12) తక్కువ పరుగులకే ఔటైనారు. ఈ దశలో స్పిన్నర్లు చాహల్, జడ్డూ కట్టుదిట్టంగా బంతులు వేసి పరుగులు కట్టడి చేస్తూ కివీస్‌పై ఒత్తిడి పెంచారు.
మ్యాచ్ గతిని మార్చిన 46 ఓవర్:
టామ్ లేథమ్ (32)తో జత కలిసిన గ్రాండ్‌హోమ్ భారీ షాట్లు కొట్టి 28 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.ఈ క్రమంలో శార్దూల్ వేసిన 46వ ఓవర్లో మూడు బౌండరీలు,ఒక సిక్సర్ బాదేసి వేగంగా జట్టును లక్ష్యానికి చేరువ చేశాడు.ఆరో వికెట్‌కు ఇరువురి ఆటగాళ్ల
అజేయ భాగస్వామ్యంతో 80 పరుగులు జోడించడంతో 47.1 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించి న్యూజిలాండ్కు చారిత్రక విజయం దక్కింది.
విఫలమైన భారత ఫాస్ట్ బౌలర్లు:
భారత స్పిన్నర్లు చాహల్ (3/47), జడేజా (1/45) మినహా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు నిరాశాజనకమైన ప్రదర్శన చేశారు.డెత్ ఓవర్ల స్పెషలిస్టు బౌలర్ గా పేరొందిన బుమ్రాఈ సిరీసులో మూడు మ్యాచుల్లోనూ కనీసం ఒక్క వికెట్ తీయకపోవడం ఆశ్చర్యకరం.మరోసారి శార్దూల్ 10 ఓవర్లలో ధారాళంగా 87 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణం అయ్యాడు.
అవకాశాన్ని వృథా చేసుకున్న ఓపెనర్ మయాంక్ :
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కొత్త ఓపెనర్ల జంట మరోసారి జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు.ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఒక్క పరుగుకే జేమీసన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ కాగా, బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ 9 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శ్రేయస్‌తో కలిసి ఓపెనర్ పృథ్వీషా స్కోరుబోర్డును ముందుకు నడపించాడు.అయితే లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ కావడంతో 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కోహ్లీసేన కష్టాలలో పడింది.
ఆపద్బాంధవుడిలా ఆదుకున్న అయ్యర్:
అయ్యర్ సొగసైన కవర్‌డ్రైవ్, బ్యాక్ ఫుట్ పై పుల్‌షాట్స్, సూపర్ అప్పర్ కట్స్‌తో అర్థ సెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు.భారత ఇన్నింగ్స్ నిలకడగా సాగుతున్న దశలో శ్రేయస్ 9 ఫోర్ల సహాయంతో 63 బంతుల్లో 62 పరుగులు చేసి నీషమ్ బౌలింగ్‌లో గ్రాండ్‌హోమ్ పట్టిన సులభతరమైన క్యాచ్ తో వెనుదిరిగాడు.దీంతో నాలుగో వికెట్‌కు శ్రేయస్-రాహుల్ జంట సాధించిన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
శతకం సాధించిన రాహుల్:
మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్‌కు దిగిన మనీష్ పాండే చక్కని. సహకారం అందించడంతో రాహుల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి అయిదో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.47 ఓవర్ లో వరస బంతులలో క్రీజులో స్థిరపడ్డ ఇరువురి బ్యాట్స్‌మన్లను బెన్నెట్ ఔట్ చేయడంతో 300 పరుగుల మైలురాయిని భారత్ చేరుకోలేదు.కేఎల్ రాహుల్ 9 ఫోర్లు,రెండు సిక్సర్లతో 113 బంతుల్లో 112 శతకంతో చెలరేగగా,మనీష్ పాండే 48 బంతుల్లో 42 పరుగులు సాధించి రాణించాడు.స్లాగ్ ఓవర్లలో ఠాకూర్(7),జడేజా(8 నాటౌట్),నవదీప్ సైని (8 నాటౌట్) దూకుడు ప్రదర్శించకపోవడంతో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు మాత్రమే చేసింది.
కివీస్ బౌలర్లలో బెన్నెట్ పేస్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన బ్యాట్స్‌మన్లలను అవుట్ చేసి నాలుగు వికెట్లు సాధించగా జెమిసన్,నీషమ్‌కు చెరో వికెట్ పడగొట్టారు.హెన్రీ నికోల్స్‌కు “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” రాస్ టేలర్‌కు “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” దక్కాయి.