iDreamPost
android-app
ios-app

కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం.. అక్రమార్కులకు షాక్‌ ఇస్తున్న వాలంటీర్లు

కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం.. అక్రమార్కులకు షాక్‌ ఇస్తున్న వాలంటీర్లు

కాదేది కవితకు అనర్హం అని ఓ మహా కవి అన్నట్లు.. కాదేది మద్యం అక్రమ రవాణాకు అనర్హం.. అనే మాటను ఆంధ్రప్రదేశ్‌లోని అక్రమార్కులు బాగా ఒంటపట్టించుకున్నట్లుగా ఉన్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధంలో భాగంగా దుకాణాల తగ్గింపు, విక్రయాలపై పరిమితి, ధరల పెంపు వంటి చర్యలను వైసీపీ సర్కార్‌ చేపట్టడంతో అక్రమ మద్యం అమ్మకాన్ని కొంత మంది వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు.

పంట రవాణా లారీ, పాల లారీ, ప్యాసింజర్‌ ఆటో, మోటారు సైకిల్‌.. ఇలా ప్రతి వాహనాన్ని మద్యం అక్రమ రవాణాకు సాధనంగా అక్రమార్కులు ఉపయోగించుకుంటున్నారు. నిన్న పంజాబ్‌ నుంచి మొక్కజొన్న సరుకు లారీలో 20 లక్షల రూపాయల విలువైన మద్యం కేసులను కృష్ణా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తీసుకురాగా.. ఈ రోజు పలు చోట్ల అక్రమ మద్యం రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడలో పాల లారీలో మద్యం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువకుడు మోటారు సైకిల్‌పై, కర్నూలు జిల్లా ఆధోనిలో ఆటోలో కర్ణాటక నుంచి మద్యం తీసుకువచ్చిన వారిని అధికారులు అరెస్‌ చేశారు.

మద్య నియంత్రణ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అక్రమ మద్యం జరిగే అవకాశం ఉంటుందని ముందే ఊహించిన సీఎం వైఎస్‌ జగన్‌ కట్టడికి పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అక్రమార్కులపై నిఘా వేసిన అధికారులు పక్కా సమాచారంతో వారి ఆటకట్టిస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ మద్యం అక్రమ రవాణా, సారా తయారీ నియంత్రణకు అత్యుత్తమంగా ఉపయోగపడుతోంది. చిమచిటుక్కుమన్నా.. వాలంటీర్లు అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాలంటీర్లకు ఫోన్‌ చేసి మద్యం, ఇసుక అక్రమాలపై ఆరా తీస్తున్నారు.