iDreamPost
android-app
ios-app

రోగాలు వ్యాపించకుండా చేతులు కడుక్కోవాలని చెప్పిన మొదటి డాక్టర్ కు ఎలాంటి అనుభవం ఎదురయ్యింది?

రోగాలు వ్యాపించకుండా చేతులు కడుక్కోవాలని చెప్పిన మొదటి డాక్టర్ కు ఎలాంటి అనుభవం ఎదురయ్యింది?

కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి మనకున్న అతి పెద్ద ఆయుధం చేతులను తరచూ శుభ్రపరచుకోవడం అని ఇప్పుడు మీకందరికీ తెలుసు. ఇప్పుడు ప్రపంచంలోని కోట్లాది మంది రోజూ సబ్బు, హ్యాండ్ వాష్, సానిటైజర్లతో గడియగడియకు చేతులు శుభ్రపరచుకోవడం సర్వసాధారణ దృశ్యం.

అయితే సుమారు నూటా డెబ్భై ఏళ్ల క్రితం హంగేరికి చెందిన డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వీస్ తొలిసారిగా ఆరోగ్య రక్షణ కోసం చేతులు శుభ్రపరచుకోవాలి అని చెప్పినప్పుడు ఆయన తోటి డాక్టర్లే అవహేళన చేశారు. అప్పటి వైద్యులంతా ఒక్కటై ఆయనను వేధించారు. చివరికి మతిస్థిమితం కోల్పోయిన ఆయనను ఒక పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే అక్కడ దిక్కులేని మరణం చెందాడు.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ సెమ్మెల్‌వీస్ పనిచేసేవాడు. ఆ ఆసుపత్రిలో రెండు మెటర్నిటీ వార్డులు ఉండేవి. ఒక దాంట్లో మగ డాక్టర్లు ఉండేవారు, మరో దాంట్లో ఆడ మంత్రసానులు ఉండేవారు. తను ఆ ఆసుపత్రిలో చేరిన కొన్నాళ్లకే డాక్టర్ సెమ్మెల్‌వీస్ ఒక అసాధారణ విషయం గమనించాడు. మగ డాక్టర్లు ప్రసవాలు చేసే వార్డులో మహిళలు ఎక్కువసంఖ్యలో ఇన్‌ఫెక్షన్ సోకి మరణించేవారు. అదే ఆడ మంత్రసానులు ప్రసవాలు చేసే వార్డులో మరణాల సంఖ్య తక్కువగా ఉండేది. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి అని పరిశోధించడం మొదలుపెట్టాడు డాక్టర్ సెమ్మెల్‌వీస్.

రెండు వార్డుల్లో ఏమేం తేడాలు ఉన్నాయో ఒక్కోటీ గమనించసాగాడు. నిజానికి వైద్యం అభ్యసించిన డాక్టర్లు ఉన్న వార్డులో మరణాలు తక్కువ ఉండాలి. కానీ మంత్రసానులు ఉన్న వార్డులోనే మరణాలు తక్కువ ఉన్నాయి. ఎన్ని రకాలుగా శోధించినా ఏ కారణమూ చిక్కలేదు అతనికి. మరోవైపు ఈ సంగతి తెలిసిన గర్భిణీ స్త్రీలు ఏదో ఒకటి చేసి మమ్మల్ని మంత్రసానుల వార్డుకే పంపండి అని వేడుకోవడం, డాక్టర్ల వార్డుకు పంపుతాం అంటే ఆసుపత్రి నుండి పారిపోవడం కూడా మొదలైందట.

అనేక రకాలుగా పరీక్షించినా ఏమీ తెలియని స్థితిలో ఒక రోజు అదే ఆసుపత్రిలో పనిచేసే తోటి పాథాలజిస్టు ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు. అతని కేసు లక్షణాలు కూడా ఆ ఆసుపత్రిలో మరణిస్తున్న మహిళల లాగానే ఉండటం డాక్టర్ సెమ్మెల్‌వీస్ గమనించాడు. ఆ పాథాలజిస్టు అంతకు కొన్ని రోజుల ముందే ఒక పోస్టుమార్టం చేస్తుండగా చేతికి ఒక స్కాల్పెల్ పరికరం గుచ్చుకుని చిన్న గాయం అయ్యి, అది పెద్దదయ్యి ఇన్‌ఫెక్షన్ శరీరం అంతా వ్యాపించి మరణించాడని తెలుసుకున్నాడు.

మరోసారి ఈ మెటర్నిటీ వార్డులో డాక్టర్ల దినచర్య ఎలాఉంది అని కూలంకషంగా పరిశీలిస్తే తేలింది ఏమిటంటే, ఈ డాక్టర్లు అదే ఆసుపత్రిలో వైద్య విద్యార్దులకు బోధనలో భాగంగా శవాలను పోస్టుమార్టంలు చేయడం, అక్కడి నుండి నేరుగా ప్రసూతి వార్డులోకి రావడం గమనించాడు. అలా వారు వస్తుంటే వారి చేతులకు మృతదేహాల తాలూకు కణాలు అంటుకుని ఉంటాయని, ప్రసూతి వార్డులో స్త్రీలకు ఇన్ఫెక్షన్ కలుగజేస్తుంది ఇవే అని డాక్టర్ సెమ్మెల్‌వీస్ ప్రతిపాదించాడు. మంత్రసానులు పోస్టుమార్టంలు చేసేవారు కాదు కాబట్టి వారి వార్డుల్లో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ ఉండేవి కాదు. మరణాలు నివారించాలంటే వైద్యులు తమ చేతులను క్లోరిన్ ద్రావణంతో కడుక్కోవాలని సూచించాడు. ఆశ్చర్యకరంగా ఇలా డాక్టర్లు చేతులు కడుక్కోవడం మొదలుకాగానే ప్రసూతివార్డులో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.

కానీ, ఈ వార్త అప్పటి వైద్య సమాజం జీర్ణించుకోలేదు. పేషెంట్ల మరణానికి కారణం డాక్టర్ల నిర్ల్యక్షమే అనే సంగతి బయటికి తెలిస్తే అది తమకు నామర్ధా అని కొందరు, అసలు డాక్టర్ సెమ్మెల్‌వీస్ కనుగొన్న దాంట్లో శాస్త్రీయత లేదని మరికొందరు ధ్వజమెత్తారు. అందరూ కలిసి అతని ఉద్యోగం ఊడగొట్టారు.

అనేక నెలలపాటు ఉద్యోగం లేకుండా ఉన్న డాక్టర్ సెమ్మెల్‌వీస్ తాను కనుక్కున్న విషయం చాలామంది ప్రాణాలు కాపాడుతుంది అని, దానిని అమలుచేయాల్సిందిగా, ప్రముఖ డాక్టర్లకు ఆగ్రహపూరిత లేఖలు రాశాడు. ఒంటరివాడై చివరికి మతిస్థిమితం కోల్పోయాడు. ఒక పిచ్చాసుపత్రిలో చేర్చగా, అక్కడ గార్డులు కొట్టిన దెబ్బలకు తాను ఏ ఇన్‌ఫెక్షన్ మూలాలు అయితే కనుక్కున్నాడో – చివరికి అదే ఇన్‌ఫెక్షన్ – సెప్సిస్ బారినపడి ఆగస్టు 13, 1865 నాడు (కేవలం 47 ఏళ్ల వయసులో) మరణించాడు.

డాక్టర్ సెమ్మెల్‌వీస్ మరణించాక రెండేళ్లకు స్కాట్‌లాండ్‌కు చెందిన సర్జన్ జోసెఫ్ లిస్టర్ కూడా ఇన్‌ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే డాక్టర్లు చేతులు, వైద్య పరికరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిపాదించాడు. దాన్ని కూడా తొలుత అనేకమంది వ్యతిరేకించినా 1870ల నుండి వైద్యులు ఆపరేషన్లు చేసే ముందు చేతులు శుభ్రపరచుకోవడం అనే ప్రక్రియ మొదలైంది. ఈ జోసెఫ్ లిస్టర్ పేరుమీదనే లిస్టరీన్ అనే ఆంటీ-సెప్టిక్ బ్రాండ్ వచ్చింది.

తదనంతర కాలంలోనే ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాశ్చర్ క్రిముల వల్లనే ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు వస్తాయని కనుక్కుని వైద్య శాస్త్రాన్ని ఒక కొత్త మలుపు తిప్పాడు.

డాక్టర్ సెమ్మెల్‌వీస్ మరణించిన అనేక దశాబ్దాల తరువాత ప్రభుత్వాలు ఆయన కృషిని గుర్తించడం మొదలుపెట్టినయి. హంగరీలోని బుడాపెస్ట్‌లో ఆయన పేరుమీద సెమ్మెల్‌వీస్ యూనివర్సిటీ నెలకొల్పారు. వియన్నా, మిస్కోల్క్ నగరాల్లో ఆయనపేరు మీద సెమ్మెల్‌వీస్ ఆసుపత్రులను నెలకొల్పారు. ఆయన స్మారకార్ధం ఒక నాణెం, ఒక పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేశారు. గూగుల్ కూడా మొన్న మార్చి 20, 2020 నాడు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన పేరిట ఒక గూగుల్ డూడిల్ రూపొందించింది.

చుట్టూ ఉన్న సమాజపు నమ్మకాలకు ఎదురీది, అనేక కష్టనష్టాలను తట్టుకుని, చివరికి ప్రాణాలే పణంగా పెట్టిన డాక్టర్ సెమ్మెల్‌వీస్ వంటి వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులందరినీ స్మరించుకునే సందర్భం ఇది.