అవకాశం ఇస్తే ఇంగ్లీష్ మీడియమే కోరుకుంటారు

ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ మీడియంపై విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన నిర్బంధం చేయడంతో ఈ చర్చ మరింత విస్తృతంగా జరుగుతోంది.

పైగా ప్రతిపక్షాలు, తెలుగు భాషాభిమానులు, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవారు సైతం కేవలం రాజకీయం కోసమే ఈ అంశంలో తలదూర్చి చర్చను రచ్చ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ళుగా కదలిక లేని తెలుగు భాషాభిమానులు ఇప్పుడే పడక కుర్చీల్లో కదలిక తెచ్చుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు. ఉద్యమం కూడా చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతున్నప్పుడు ఈ మాతృభాషాభిమానులు కళ్ళు తెరవలేదు. పల్లెలలకు కూడా ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించి ఇంగ్లీష్ మీడియం విద్యాబోధన ప్రారంభించి వందలు, వేలల్లో పీజులు వసూలు చేస్తుంటే వీళ్ళలో కదలిక రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేటు పాఠశాలలు వచ్చి అసలు మచ్చుకు కూడా తెలుగు బోధన లేకుండా చేస్తే పడక కుర్చీల్లో ఉన్న ఈ మేధావులు కాస్త అటూ, ఇటూ కూడా కదిలిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం తెలుగు చచ్చి పోతోందని రెచ్చిపోతున్నారు.
పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించిన వారు, మనవళ్ళు, మనవరాళ్ళను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్న వాళ్ళు తెలుగు మీడియం కోసం, తెలుగు భాష కోసం యజ్ఞం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. తమ ఇంట్లో రెండోతరం లేదా మూడో తరం పిల్లల్ని ఇంగ్లీష్ కాన్వెంటులో దింపి ఆ తర్వాత వీధిలోకి వచ్చి తెలుగు మీడియం అంటూ ఆందోళన చేస్తున్నారు.

ఇక రాజకీయ పార్టీలు కూడా ఈ విషయాన్ని రాజకీయం కోసమే చూస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టిడిపి మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతించే లోపు ఈ పాఠశాలలను తన మంత్రివర్గంలోని నారాయణ నడిపే అన్ని పాఠశాలకు మున్సిపల్ పాఠశాలలపై పెత్తనం అంటగట్టింది. ఈ పెత్తనాన్ని నిరసించిన ప్రజలకు అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. అప్పుడు తమ నిర్ణయాన్ని వైఎస్సార్ పార్టీ వ్యతిరేకించింది కాబట్టి ఇప్పుడు వారి నిర్ణయాన్ని తాము వ్యతిరేకించాలనే ఆలోచన తప్ప తెలుగు బాషపై కానీ, ప్రభుత్వ పాఠశాలలపై కానీ ఆ పార్టీకి శ్రద్ధ ఉన్నట్టు కనిపించదు. బహుశా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కావడానికి, ప్రైవేటు పాఠశాలలు దినదినాభివృద్ధి చెందడానికి పల్లెలలకు విస్తరించడానికి ఈ పార్టీ పాలనే కారణంగా చెప్పవచ్చు.

కోర్టులు కూడా రాష్ట్రంలో తెలుగు మీడియం ఉండాలని ఇంగ్లీష్ లో తీర్పు ఇచ్చాయి. తెలుగు బాషా ప్రాముఖ్యతను గూర్చి కోర్టులు పేజీలకొద్దీ తీర్పును ఆంగ్లంలో ఇచ్చి ప్రభుత్వ ప్రయత్నాలు అడ్డుకునే కృషిలో భాగం అయ్యాయి. దీనితో తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకున్న ప్రభుత్వం 97 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం మాత్రమే కావాలని కోరుతున్నారని తేల్చింది.

తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోడానికి సర్వేలు అక్కర్లేదు. గ్రామాలతో పరిచయం ఉంటే సరిపోతుంది. పల్లెలకు విస్తరించిన ప్రవేటు పాఠశాలలు, వాటిలో విద్యార్థుల సంఖ్య చూస్తే తెలుస్తుంది. యేడాదికేడాదీ ప్రభుత్వ పాఠశాలల్లో పడిపోతున్న విద్యార్థుల సంఖ్య చూస్తే తెలుస్తుంది. కానీ ఇవన్నీ చూస్తే రాజకీయం ఏమవుతుంది? విద్యా వ్యాపారం అప్రతిహతంగా చేస్తున్న ప్రవేటు వ్యాపారులు ఏమవుతారు? ఇప్పుడు సమస్య ఇదే. ఇంత పెట్టుబడి పెట్టి గ్రామాల్లో పాఠశాలలు నెలకొల్పిన ప్రవేటు వ్యాపారుల లాభాలను కాపాడడమే లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మాతృ బాష అనొచ్చు, తెలుగు బాష అనొచ్చు. నిర్బంధ విద్యకు వ్యతిరేకం అనొచ్చు.
నినాదం ఏదైనా కానీ లక్ష్యం ఒక్కటే – ప్రవేటు విద్యా వ్యాపారానికి అండగా నిలవడం. ప్రవేటు విద్యాసంస్థలు అభివృద్ధికి తెలుగు బాషపై మక్కువ పెరుగుతోంది.

Show comments