Idream media
Idream media
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ) అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తనకు తానే ఎస్‌ఈసీగా ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు నిన్న శనివారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో తాజా పరిణామాలపై వేగంగా పావులుకదుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించడంలేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడుతుందని రేపు సోమవారం హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేసేందుకు రమేష్‌కుమార్ సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తాజా పరిణామాలపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నన్ను తొలగించడంపై నేను వేసిన రిట్ పిటిషన్(నెం.8163)పై హైకోర్టు మే 29న తీర్పు ఇచ్చింది. అందులోని 307వ పేరాలో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 10వ జారీ చేసిన ఆర్డినెన్స్‌తోపాటు దానికి అనుగుణంగా జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ జారీ చేసిన జీవోలను కూడా పక్కన పెట్టింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నా పదవిని పునరుద్ధరించడంతోపాటు.. నా పదవీ కాలం పూర్తయ్యే వరకూ అంటే మార్చి 31వ తేదీ వరకూ కొనసాగించాలి అని చెప్పింది. ఈ తీర్పును అనుసరించి జస్టిస్ కనగరాజ్ కార్యాలయానికి వచ్చే అవకాశం లేదు. అలాగే అయన నియామకం కూడా చెల్లనట్టే. రాష్ట్రంలో ఓ రాజ్యాంగబద్ధమైన పదవి ఎవరూ చేపట్టకుండా ఉండటానికి, అలాగే ఖాళీగా ఉండటానికి వీళ్లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా నన్ను తొలగించలేదు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ వల్ల నేను పదవిలో కొనసాగలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ రద్దు అయిందంటే తిరిగి నేను యథాతథంగా నా పదవిని కొనసాగించవచ్చనే అర్థం. దానికి అనుగుణంగానే నేను తిరిగి నా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం ఇచ్చాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కూడా అందుకు అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 30వ తేదన ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు ఉపయోగించిన భాష, చెబుతున్న కారణాలు, వ్యవహరించిన విధానం చూస్తే.. ఈ ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులను ఏ మాత్రం గౌరవించే ఉద్దేశం ఉన్నట్లుగా కనిపించడం లేదు.
దక్షత, స్వతంత్రత కలిగిన రాజ్యాంగబద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత విచారకరం. రాష్‌ర్ట తీసుకున్న విధానం.. హైకోర్టు ఉత్తర్వులు, తీర్పునకు విరుద్ధం’’ అని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.