iDreamPost
android-app
ios-app

ఆయనో అద్భుతమైన జర్నలిస్ట్ అంట!!!

ఆయనో అద్భుతమైన జర్నలిస్ట్ అంట!!!

ఇటీవల కాలంలో తన వివాదాస్పద వ్యవహార శైలితో TV 5 మూర్తి తరచూ విమర్శలకు గురవుతున్నారు. తానూ పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అన్న చందాన, తానూ చెప్పింది మాత్రమే కరెక్ట్.. తన వాదనే వినాలి.. అంటూ కేంద్రం లో అధికారంలో ఉన్న జాతీయ పార్టీల అధికార ప్రతినిధులను సైతం హుంకరిస్తూన్నారు. టీవీ చర్చలో పాల్గొన్న ప్రతినిధులు ఎవరేం మాట్లాడాలో ఆ అజెండా ని కూడా ముందే నిర్దేశిస్తున్నారు. ప్రజాబాహుళ్యంలో దశాబ్దాలుగా పని చేస్తున్న నేతలను సైతం ఏకవచనంతో హెచ్చరిస్తూ.. వారి వైపు వేళ్ళు చూపిస్తూ.. మీడియా స్టూడియో బల్లలమీదెక్కి చేస్తున్న ఓవర్ యాక్షన్ ను చూస్తుంటే.. టివి చూస్తున్న సామాన్య జనానికి సైతం అతని హావభావాలు చూసి ఒక జోకర్ ని చూసినట్టు చూసి నవ్వుకునే స్థాయికి TV 5 మూర్తి దిగజారాడు.

టివి జర్నలిజంలో ఆ స్థాయిలో ఉన్న ప్రధాన వ్యాఖ్యాతలు వివిధ రాజకీయ పక్షాలతో ప్రజాసమస్యల మీద చర్చలు నిర్వహించేటప్పుడు హుందాగా వ్యవహరిస్తూ వివిధ పక్షాలు తరపు హాజరైన ప్రతినిధులకు వారు చెప్పాలనుకున్న వారి పార్టీ తాలూకు విధానాలను స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళేటటట్టు సుమన్వయం వహించాలి. అదే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులెవరైనా మాటామాటా పెరిగి ఆవేశకావేశాలకు లోనైనా వారిని ఓర్పుగా నియంత్రించాల్సింది బాధ్యత సదరు వ్యాఖ్యాత మీదే ఉంటుంది. అయితే TV 5 లో జరిగే చర్చల్లో మాత్రం న్యూట్రల్ వ్యాఖ్యాతగా ఉండాల్సిన మూర్తి గారే తన సహనం కోల్పోయి రాజకీయ ప్రనిధులపై తీవ్ర పదజాలంతో దూషణల పర్వానికి దిగడాన్ని చూసిన రాజకీయ పార్టీలు కూడా అతని వ్యవహార శైలితో ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన మూర్తి బిజెపి ప్రతినిధి లంక దినకర్ మధ్య జరిగిన వివాదమే ఒక ఉదాహారణ. TV 5 లైవ్ సాక్షిగా మూర్తి తన స్థాయిని, హొదాని మరచి విచక్షణ కోల్పోయి ఒక పార్టీకి చెందిన అధికార ప్రతినిధి పై యూఆర్ఏ లయ్యర్… చీటర్.. అంటూ నోరు జారారు.

సాధారణంగా ప్రతి మీడియా హౌస్ కి రాజకీయాల విషయంలో ఒక స్పష్టమైన లైన్ ఉంటుంది. ప్రొఫెషనల్ జర్నలిజం వృత్తిలో ఉన్నవారు సాధారణంగా ఏ సంస్థలో పనిచేస్తే, ఆ సంస్థ అజెండా ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఆ విషయంలో జర్నలిస్ట్ కి ఉన్న పరిమితిని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఒక పక్క తానూ న్యూట్రల్ అంటూ ప్రకటించుకొని నిత్యం వివాదాస్పదమైన కామెంట్లు చేస్తూ తన వ్యక్తిగత పాపులారిటీ కోసం పాకులాడడాన్ని ఆదర్శ జర్నలిజం అనాలో ?? లేక వ్యక్తిగత పైత్యం అనాలో అర్ధం కావడం లేదు. బహుశా మూర్తి తన పాపులారిటీ కోసం జాతీయ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి లాంటి వారి బాడీ లాంగ్వేజ్ ని అనుకరిస్తూ వ్యక్తిగత పాపులారిటీ పెంచుకోవడానికి పాకులాడుతున్నాడనిపిస్తుంది. టివి జర్నలిజంలో మూర్తి వ్యవహారశీలి చూస్తే.. మొదట ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానెల్ నుండి మహా టివి కి, మహాటీవీ నుండి TV 5 వరకు ఇలా మొదటి నుండి తనకు తానుగా కావాలనే వివాదాస్పదమైన టాబ్లాయిడ్ అంశాలపై చర్చలకు తెరతీసి.. తన వ్యక్తిగత పాపులారిటీ పెంచుకోవడం కోసం తపనపడేవాడని తోటి జర్నలిస్టులు చెబుతున్నారు.

అందులో భాగంగానే గతంలో మహాటీవీ లో ఉన్నప్పుడు సినీ విమర్శకుడు దళిత హక్కుల నేత కత్తి మహేష్ తో వివాదం, తరువాత వివాదాస్పద సినీనటి శ్రీ రెడ్డి తో కాస్టింగ్ కౌచ్ పై చర్చలు.. ఆసమయంలో కూడా మూర్తి తన వ్యవహారశైలితో పరిధి దాటి ప్రవర్తించేవాడు. మహా టివిలో మూర్తి చేసిన జనసేన నిధుల సేకరణ కార్యక్రమం తాలూకు “స్టింగ్ ఆపరేషన్” తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఆ వివాదంలో మహా టీవీ యాజమాన్యం మూర్తి వ్యవహార శైలి తో విసిగిపోయి అతన్ని తమ ఛానెల్ నుండి బయటకు పంపింది. ఆతరువాత మూర్తి ఎబిఎన్ ఛానెల్‌కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాడు, కాని ముర్తి గతంలో రెండుసార్లు ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ను విడిచిపెట్టినందున అతన్ని తిరిగి చేర్చడానికి రాధా కృష్ణ ఆసక్తి చూపలేదు. చివరికి స్వామీజీ సిఫారసు మూర్తికి టీవీ 5 లో ఉద్యోగం పొందడానికి సహాయపడింది. మూర్తి అప్పటికే ఎబిఎన్‌కు తిరిగి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇతర ఛానెళ్లలో చాలా మంది అతని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు. చివరగా స్వామీజీ సిఫారసుతో టీవీ 5 లో ఉద్యోగం పొందగలిగాడు.

TV 5 లో చేరిన తరువాత కూడా మూర్తి వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాలేదు. అయితే ఇక్కడ అమరావతి, చంద్రబాబు అనుకూల వార్తలతో ప్రభుత్వం పై.. ప్రభుత్వ పెద్దలపై ఏకవచనంతో అభ్యంతరకర భాషలో విమర్శిస్తూ తీవ్ర విమర్శలపాలౌతున్నారు. అయితే ప్రస్తుతానికి యాజమాన్యం అజెండా ప్రకారం మూర్తి వ్యవహరిస్తుండడంతో TV 5 యాజమాన్యం అండదండలు మూర్తికి లభిస్తున్నాయి. అయితే మూర్తి లాంటి వారి వ్యవహారశైలి TV 5 కి ఏమాత్రం ఉపయోగపడకపోగా సదరు ఛానెల్ మాత్రం ఇటీవల కాలంలో టీఆర్పీ రేటింగ్ లో దారుణంగా కిందకు పడిపోతుంది. తన వైఖరిని మార్చుకోకపోతే మాత్రం అక్కడ కూడా మూర్తి ఎక్కువరోజులు నిలబడే అవకాశం లేదు.