Idream media
Idream media
అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు..!!
గ్రేటర్ హైదరాబాద్ వాసులారా… బహుపరాక్! కరోనా కన్నెర్ర చేస్తోంది. సిటీ లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న కేసులు.. మరణాల శాతం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మార్కెట్, ఆఫీస్, షాప్… ఎక్కడికెళ్లినా… ఎవరిని కలిసినా.. అప్రమత్తంగా ఉండాల్సిందే. ఆదమరిచారో.. కరోనాను మీ ఇంటికి ఆహ్వానించినట్లే..! పెరుగుతున్న సడలింపులతో పాటు కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఒక్క మే నెల లోనే.. ఏకంగా 1015 కేసులు నమోదు అయ్యాయి. నెల ప్రారంభంలో 5, 15, 20, 3, 11.. ఇలా స్వల్ప కేసుల తో పర్వాలేదులే అనుకుంటున్న తరుణంలో అదే నెల 11వ తేదీన ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 79 కేసులు నమోదై అత్యంత ఎక్కువ కేసులు నమోదైన రోజుగా రికార్డ్ అయితే… 29వ తేదీన 82, మే నెల చివరి రోజు 31 న ఏకంగా 122 కేసులు నమోదై అటు ప్రజలను, ఇటు అధికారులను అమ్మో అనేలా చేసింది.
ఇదిలా ఉంటే జూన్ నెల మొదటి రోజే 79 కేసులు నమోదై వామ్మో జూన్.. అని భయపెట్టింది. మే నెల మొదటి మూడు రోజులు పాజిటివ్ కేసులు 40 ఉంటే… జూన్ లో మొదటి మూడురోజులు 257 కేసులు నమోదు అయ్యాయి. పెరుగుతున్న ఈ లెక్కలు వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగింది అన డానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంకో భయంకరమైన అంశం ఏమిటంటే… ఈ వేగాన్ని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెలాఖరుకు తెలంగాణలో ఏకంగా 60 వేల కేసులు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందులో అత్యధిక కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం కూడా అదే అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రానికి తెలిపింది. ప్రభుత్వం కన్నా పౌరులే ఇపుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. అడుగడుగులో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఆ కేసుల లెక్కల్లో చేరకుండా ఎవరికి వారే స్వీయ రక్షణ పాటించాల్సిందే. వ్యాక్సిన్ వచ్చే వరకూ అంతకు మించి ఏమీ చేయలేమని ప్రభుత్వాలు కూడా చెబుతున్నాయి. అదే వాస్తవం కూడా.