Idream media
Idream media
సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ స్పీకర్.. యనమల రామకృష్ణుడు చరిత్ర మరిచి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు.. గోరంత రాష్ట్ర అప్పు కొండత చేసి వెళ్లారు. ఇప్పుడు సదరు మాజీ ఆర్థిక మంత్రి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉంది.
అప్పులు చేయడం ఓ హక్కుగా భావించిన యనమల చంద్రబాబు ప్రభుత్వంలో ఎడా పెడా దొరికిన ప్రతి చోటా అప్పులు తెచ్చారు. ‘‘ అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం’’ అంటూ 2018లో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంట్లో మీడియా సమావేశంలో మాట్లాడిన విషయం యనమల మరిచిపోయినట్లుగా ఉన్నారు. అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం.. అంటూ అప్పులు చేయడాన్ని తనదైన శైలిలో సమర్థించుకున్న యనమల ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎనిమిదినెలల్లో 40 వేల కోట్ల అప్పు చేసిందని తెగ బాధపడిపోతున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి మాత్రం పల్లెత్తు మాట మాట్లాడడంలేదు.
రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలకే దాదాపు 15 వేల కోట్ల రూపాయలు కేటాయించి.. ఆ నగదును లబ్ధిదారులకు అందజేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపులు.. పింఛన్‌దారులకు రెట్టింపు నగదు.. ఇలా చెప్పకుంటూ పోతే అనేక పథకాలున్నాయి.
చంద్రబాబు ప్రభుత్వంలో యనమల రామకృష్ణుడు నేతృత్వంలో చేసిన అప్పులు గురించి లెక్కలు తీస్తే ఎవ్వరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే.
రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పు ఒక లక్షా 66 వేల కోట్లుగా తేల్చారు. ఇది రాష్ట్రం ఏర్పడిన 1953 నుంచి 2014 వరకు చేసిన అప్పు కావడం ఇక్కడ గమనార్హం. అప్పులు, ఆస్తుల పంపకం.. జానాభా నిష్పత్తి ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతం చొప్పున పంచారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల ఏపీకి 96 వేల కోట్ల అప్పు వచ్చింది. 1953 నుంచి 2014 వరకు 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అప్పు కేవలం 1.66 లక్షల కోట్లు కాగా.. చంద్రబాబు ప్రభుత్వం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఐదేళ్లలో 2.69 లక్షల కోట్ల అప్పు చేసింది. పాత అప్పు 96 వేల కోట్లు కాకుండా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు కూడా కలిపితే.. బాబు దిగిపోయే నాటికి ఏపీ అప్పు 3.65 లక్షల కోట్లుకు చేరింది.
ఐదేళ్లలో రాష్ట్ర బడ్జెట్ ఏడాదికి సరాసరి 1.50 లక్షల కోట్లు. అంటే ఐదేళ్లలో బడ్జెట్ మొత్తం దాదాపు 7.50 లక్షల కోట్లు. ఇది కాకుండా కొత్తగా చేసిన అప్పు 2.69 లక్షల కోట్లు.
బడ్జెట్‌ను పక్కన పెడితే.. ఇంత మొత్తంలో అప్పు తెచ్చిన నిధులు ఏమైనట్లు..? దాదాపు 55 వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు(ఈ నిధులు కేంద్రం ఇస్తోంది). లక్ష కోట్ల అమరావతి రాజధానిలో టీడీపీ చెబుతున్న లెక్కల ప్రకారమే 10 వేల కోట్లు పెట్టారు.(రాజధానికి కేంద్రం 1500 కోట్లు ఇచ్చింది). ఇరిగేష్ ప్రాజెక్టు ఒక్కటీ పూర్తి కాలేదు. సరే.. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాలు బాగుపడ్డాయంటే.. అదీ లేదు. మరి ఇంత మొత్తం నగదును ఏమి చేశారో.. యనమల చెప్పగలరా..?