Idream media
Idream media
కరోనా సమస్యని పెద్దలే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక పిల్లలకి ఎలా అర్థమవుతుంది. కరోనాకి ముందు పిల్లలతో గడపడానికి టైమే ఉండేది కాదు. అమ్మానాన్న ఇద్దరూ ఉద్యోగులుగా ఉన్న ఇళ్లలో మరీ కష్టం. ఉదయాన్నే పిల్లలు స్కూల్‌కి వెళ్లేవాళ్లు. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్ లేదా హోంవర్క్. అయిపోగానే అలసిపోయి నిద్ర. సెలవు రోజుల్లోనే అమ్మానాన్నలకి కాస్త తీరిక. పిల్లలకి కాస్త రిలీఫ్. వీలైతే ఎక్కడికైనా వెళ్లే వాళ్లు.
ఇపుడు కావాల్సినంత సమయం ఉంది. కానీ ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదు. ఇంట్లోనే ఉండాలి. కాసేపు ఫోన్లో గేమ్స్ ఆడుతారు. కాసేపు టీవీ చూస్తారు. కానీ ఎంత సేపు? ఎన్నాళ్లు? బయటికి వెళతామనే గొడవ మొదలైంది. ఇంటి బయటే ఆడుకుంటామని అంటున్నారు. కానీ తల్లిదండ్రులకి భయంగా ఉంది. బయటికి పంపడం లేదు. పక్కింటి పిల్లలతో ఆడాలని కోరిక. అయితే ఎవరి భయాలు వాళ్లవి.
కొంచెం పెద్ద పిల్లలైతే అర్థం చేసుకుంటున్నారు. చిన్న పిల్లలతో మరీ ఇబ్బంది. ఏడ్చి వస్తువులన్నీ విసిరి కొడుతున్నారు. తల్లిదండ్రులు విసిగిపోయి వాళ్లలో వాళ్లు గొడవ పడుతున్నారు. కరోనాతో సామాజిక సమస్యలే కాదు, ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఖాళీగా ఉండటంతో పిల్లలే కాదు, పెద్దవాళ్లు కూడా ఏదో ఒకటి నమిలి బరువు పెరుగుతున్నారు.
కాస్తా జరుగుబాటు ఉన్న కుటుంబాల సమస్య ఒక రకంగా ఉంటే, పేదవాళ్ల సమస్య ఇంకో రకంగా ఉంది. పెద్దవాళ్లు పనులకి వెళ్లలేక పోతున్నారు. డబ్బులు లేక పిల్లల ఆకలి తీర్చడం కష్టంగా ఉంది. వీళ్లకి కరోనా భయం కంటే ఆకలి భయం ఎక్కువగా ఉంది.
పిల్లలు కూడా మైదానంలోకి వెళ్లి క్రికెట్ ఆడే అవకాశం లేకపోయే సరికి సొంతంగా వాళ్లే దొంగాపోలీస్ , వైకుంఠపాళి ఇలా పాత ఆటలు ఆడుకుంటున్నారు. ఇద్దరు పిల్లలున్న ఇంట్లో కీచులాటలు, ఒకే పిల్లాడు ఉన్న ఇంట్లో ఒంటరితనం.
పట్టణాల కంటే పల్లెలు మెరుగ్గా ఉన్నాయి. అక్కడ కరోనా భయం తక్కువగా ఉంది. పిల్లలు కలిసే ఆడుకుంటున్నారు. చెట్లకు ఊయల ఊగుతూ బావుల్లో ఈదుతున్నారు.
కరోనా ఇలాగే ఉంటే ఈ ఏడాది ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు కూడా చెల్లించలేని స్థితికి తల్లిదండ్రులు చేరుకుంటారు. పెద్ద వాళ్లే కాదు పసివాళ్లు కూడా ఈ రాక్షసి కోరల్లో చిక్కుకుంటారు.