Idream media
Idream media
దాదాపు ఏడాది కాలంగా ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులు, వాయిదాలతో సాగిన ఇళ్ల పట్టాల పంపిణీ పండగ ఎట్టకేలకు వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ నాడు జరగడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో నిజమైన పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఏళ్ల తరబడి సొంత ఇంటి కలలను కంటున్న వారి కలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎట్టకేలకు సాకారం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్నికల వేళ ఇచ్చిన హామీని అమలు చేసి.. మాట తప్పనని, మడమ తప్పినని మరోమారు రుజువు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన భృహత్తర కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరిలో ప్రారంభించగా.. అదే సమయంలో 175 నియోజకవర్గాల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నికల వేళ హామీ..
ఒకేసారి 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రజా సంక్షేమ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోయింది. భారీ స్థాయిలో ఒకేసారి అర్హులైన వారందరికీ వేర్వేరుగా ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన సీఎం వైఎస్ జగన్‌కు ప్రజా సంకల్ప పాదయాత్రలో వచ్చింది. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ఈ బృహత్తర కార్యక్రమానికి ఎన్నికలకు ముందే ఆలోచన చేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. నవరత్నాల పథకాల్లో ఇళ్ల నిర్మాణం కూడా ఒకటి కావడం.. పేద వారి సొంత ఇంటి కలను సాకారం చేయాలన్న సీఎం జగన్ ఆలోచనకు నిదర్శనం.
అర్హతే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక..
చెప్పిన మాట మేరకు తన ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకునేలోపు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, అదే సమయంలో ఇళ్లు నిర్మించే కార్యక్రమం చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ భావించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పలుమార్లు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వాలంటీర్లు అర్హులను గుర్తించి వారిచేత దరఖాస్తు చేయించారు. చోటామోటా నాయకుల సిఫార్సులతో పని లేకుండా.. లంచాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అర్హులను ఎంపిక చేశారు. 25 లక్షలు లక్ష్యంగా పెట్టుకుంటే 30.75 లక్షల మంది అర్హులుగా తేలడం విశేషం.
కోర్టు కేసులు.. వాయిదాలు..
ఈ ఏడాది తెలుగు సంవత్సరం ప్రారంభరోజైన ఉగాది పండగనాడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ భావించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై పలు చోట్ల టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయించడంతో వాయిదా పడింది. ఆ తర్వాత శ్రీరామనవమి రోజున ఇవ్వాలని భావించినా.. సాధ్యం కాలేదు. చివరికి ఆగస్టు 15వ తేదీన ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసినా.. కోర్టు కేసులు పరిష్కారం కాలేదు. అయితే కోర్టు కేసులున్న 3.51 లక్షల ఇళ్ల స్థలాలు మినహా.. మిగతావి ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ రోజు ఇళ్ల పండుగ జరిగింది. కోర్టులోవివాదాలు పరిష్కారం అయిన తర్వాత మిగిలిన 3.51 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు.
ఆరోపణలు, విమర్శలు..
ఓ వైపు కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల స్థలాల కార్యక్రమాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు.. అదే సమయంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆరోపించడం ప్రారంభించారు. స్థలాల సేకరణ పూర్తయిన తర్వాత.. ఆయా స్థలాల చదును చేయడంపై కూడా టీడీపీ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. ఇళ్ల స్థలాల చదును పేరుతో వైసీపీ ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు తమ పార్టీ నాయకులకు దోచిపెట్టిందంటూ ఆరోపించారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా.. పేదవాళ్లకు మంచిచేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకున్నారు.
స్థలమే కాదు.. ఇళ్లూ ఉచితం..
ఇళ్ల స్థలం ఇవ్వడతోపాటు. అందులో ఇంటిని కూడా ప్రభుత్వమే రూపాయికే నిర్మించి ఇవ్వబోతోంది. 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించబోతున్నారు. ఇంటిలోనూ, ఆయా కాలనీల్లోనూ సకల సౌకర్యాలను ప్రభుత్వమే కల్పించబోతోంది. ఇంటిపై సర్వహక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తోంది. ఐదేళ్ల తర్వాత ఆ స్థలాన్ని, లేదా ఇంటిని విక్రయించుకునే వెలుసుబాటును కల్పించింది. ఇళ్లు, ఇళ్ల స్థలం వారికి ఒక ఆస్తిలా ఉపయోపడేలా చర్యలు తీసుకుంది. ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకునేందుకు అవకాశం కల్పించింది. 68,361 ఎకరాలను ఇళ్ల స్థలాల పేరుతో పేదలకు జగన్ ప్రభుత్వం పంచింది. దీని విలువ మార్కెట్‌లో దాదాపు 25 వేల కోట్ల రూపాయలు ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
రెండు దశల్లో ఇళ్ల నిర్మాణం..
ఇళ్ల స్థలాల్లో రెండు దశల్లో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన రోజే 15.60 లక్షల ఇళ్లు నిర్మాణానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఏడాదిలో వీటిని నిర్మించబోతున్నారు. ఆ తర్వాత రెండోదశ కింద మిగిలిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు నిర్మించబోతున్నారు. ఒకొక్క ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలను వెచ్చించబోతోంది.
నిరంతర ప్రక్రియ.. ఇంటి బాధ్యత ప్రభుత్వానిదే..
వివాహం అయిన వారిని ఒక కుటుంబంగా పరిగణిస్తారు. వారికి ప్రత్యేకంగా రేషన్‌కార్డు, ఇతర గుర్తింపు పత్రాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని సీఎం జగన్ ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో వారికి ఇళ్ల స్థలం ఇవ్వాలని జగన్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకోవడం పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో భరోసాను ఇస్తోంది. పేద, మధ్య తరగతి వారికి సొంత ఇళ్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవడంతో సీఎం వైఎస్ జగన్‌పై ప్రశంసల జల్లుకురుస్తోంది.