హిట్ కాకున్నా ఆ సినిమాలను మళ్ళీ మళ్ళీ తీస్తున్న దర్శక నిర్మాతలను మెచ్చుకోవాల్సిందే..- Nostalgia

  • Published - 11:09 AM, Sat - 1 February 20
హిట్ కాకున్నా ఆ సినిమాలను మళ్ళీ మళ్ళీ  తీస్తున్న దర్శక నిర్మాతలను మెచ్చుకోవాల్సిందే..- Nostalgia

హాలీవుడ్ లో ఏదైనా సినిమా విజయవంతం అయితే ఆ సినిమా తర్వాత వరుసగా సీక్వెల్స్ చేసుకుంటూ వస్తారు. ఇది అక్కడి ఫిల్మ్ మేకర్స్ కి అలవాటు. అక్కడ సీక్వెల్స్ కి కూడా ఆదరణ బాగుంటుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు ఊహించని విధంగా హిట్ అయితే దాని సీక్వెల్స్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది.

అలా వచ్చిన మూవీ సిరీస్ లలో హారీ పాటర్, ఎక్స్ మెన్, నార్నియా, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అవెంజర్స్ లాంటివి విజయవంతం కావడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. ఇందులో టెర్మినేటర్ సిరీస్ ను మినహాయించాలి.

జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన టెర్మినేటర్ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమాతో కామెరూన్ స్టార్ డైరెక్టర్ గా మారగా, ఆర్నాల్డ్ కి స్టార్ ఇమేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్స్ మొదలయ్యాయి.

మొదటి సినిమా హిట్ అయితే రెండో సినిమాపై తారాస్థాయిలో అంచనాలు ఉంటాయి. కాబట్టి రెండో సినిమాకి బడ్జెట్ పెరిగింది. లాభాల శాతం మాత్రం తగ్గింది. మొదటి భాగం పది రెట్ల లాభం తెస్తే, రెండో భాగం ఐదు రెట్ల లాభాలకు పరిమితం అయింది.

కానీ మూడో భాగం నుండి లాభాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పెట్టుబడిని వెనక్కు తెచ్చి కొద్దిగా లాభాలను పంచింది.. నాలుగో భాగం నష్టాలను మిగిల్చింది. ఐదు ఆరు భాగాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

1980 లో అప్పటికి టెర్మినేటర్ ఫ్రెష్ స్టోరీ కాబట్టి ప్రేక్షకుల మద్దతు ఆ సినిమాకి ఉంది. కానీ ఒకే స్టోరీని ఏ మాత్రం మార్పులు లేకుండా కాలంతో పాటు మారకుండా,ప్రేక్షకులపై రుద్దితే, వాటిని తెలివిగా తిప్పి కొట్టారు ప్రేక్షకులు.

ఇటీవల కాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించిన టెర్మినేటర్ డార్క్ ఫేట్ ను కూడా ప్రేక్షకులు తిరస్కరించారు. అదే జాన్ కానర్, అదే కైల్ రీస్, అదే సారా కానర్ లతో కూడిన కథను మళ్ళీ మళ్ళీ ఏ మాత్రం మార్చకుండా చూపిస్తే ఏ ప్రేక్షకుడు మాత్రం ఒప్పుకుంటాడు.

ఎప్పుడు చూసినా భవిష్యత్తు నుండి వచ్చిన సైబోర్గ్ చేసే దాడుల నుండి తప్పించుకుని పారిపోవడమే సినిమాగా తీస్తే అదే కథని చూసి చూసి ప్రేక్షకులకు కూడా మొహం మొత్తినట్లుంది. ఈ మధ్య  ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారని తెలిసినా అత్యంత భారీ బడ్జెట్ తో టెర్మినేటర్ సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు, ఏమాత్రం కొత్తదనం లేకుండా తీస్తున్న డైరెక్టర్ల ధైర్యాన్ని మాత్రం మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే తీరని నష్టం వస్తుందని తెలిసినా కొత్తదనం లేని సినిమాను అత్యంత భారీ హంగులతో తీస్తున్నందుకు.

Show comments