తీవ్ర ఒత్తిడిలో తెలుగు నిర్మాతలు

కరోనా వల్ల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయిపోవడంతో సినిమా రంగానికి దిక్కు తోచడం లేదు. హీరోలైతే ఇంట్లో రెస్టు తీసుకుంటూ వీడియోలు చేసుకుంటూ జనంలో కాస్త చైతన్యం తెచ్చే పనులు చేస్తున్నారు కానీ జరుగుతున్న పరిణామాలు నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. థియేటర్లు తెరిచే సూచనలు ఇప్పుడిప్పుడే కనిపించడం లేదు. సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి అగ్ర నిర్మాతలు ఈ ఏడాది వృథా అయినట్టే అన్న తరహాలో అభిప్రాయాలు వెలిబుచ్చడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మరోవైపు ఊరించేలా వస్తున్న ఓటిటి ఆఫర్లకు కొత్త సినిమాల ప్రొడ్యూసర్లు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ విషయంలో అందరిలోనూ ఏకాభిప్రాయం లేదు. బయటికి కాకపోయినా అంతర్గతంగా రెండు వర్గాలుగా చీలిపోయారని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే వడ్డీల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మరోవైపు అడ్వాన్సులు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి ఇవన్నీ కలిసి బిపిని పెంచేసి ఏదో ఒక నిర్ణయం తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయని కొందరు నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట.

ఇప్పటికైతే నాని వి, ఉప్పెన, ఒరేయ్ బుజ్జిగా, నిశ్శబ్దం, అరణ్య నిర్మాతలు తాము ఆన్ లైన్ లో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ఇంకొన్ని విడుదలకు రెడీగా ఉన్న సినిమాలు త్వరలో తమ నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. తమిళనాడులో మే 1 నుంచి కొన్ని మీడియం మరియు చిన్న చిత్రాలను ఓటిటికి ఇచ్చేలా ఒప్పందాలు జరిగిపోయాయట. వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా రేపో ఎల్లుండో రావొచ్చు. హిందీలోనూ ఇదే తరహా పోకడ వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఆర్థికంగా ఏర్పడిన అనిష్చితి నుంచి బయటపడాలంటే చాలా నిర్మాతలకు ఇంత కన్నా వేరే ఆప్షన్ లేదు. మరోవైపు స్ట్రీమింగ్ యాప్స్ కు చందాదారులు అమాంతంగా పెరిగిపోతున్న తరుణంలో బంగారం లాంటి ఈ అవకాశాన్ని వదులుకునేందుకు సదరు సంస్థలు సిద్ధంగా లేవు. అందుకే మార్కెట్ రేంజ్ కి మించి 40 కోట్ల దాకా ఆఫర్లు ఇస్తున్నారు. సో ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందనేది మే 5 తర్వాత బహుశా ఒక క్లారిటీ రావొచ్చు. అప్పటిదాకా నిర్మాతలు రోజు వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించుకుంటూ ఏం చేద్దాం అనే దాని గురించే గంటల తరబడి మాట్లాడుకుంటున్నారట. చూద్దాం ఇది ఎక్కడికి దారి తీస్తుందో.

Show comments