iDreamPost
android-app
ios-app

బిజీ బిజీగా శ్రీ లీలా.. అలనాటి మీనాను గుర్తు చేస్తూ..

బిజీ బిజీగా శ్రీ లీలా.. అలనాటి మీనాను గుర్తు చేస్తూ..

రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఇప్పుడు జెట్ స్పీడులో దూసుకుపోతోంది. శ్రీలీలతో పాటు అరంగేట్రం చేసిన శ్రీకాంత్ కొడుకు రోషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నట్టు ముందడుగే లేకుండా ఆగిపోయాడు. శ్రీలీలకి వెంటనే మాస్ మహరాజ్ కాంబోలో ధమాకా రావడం, అది హండ్రెడ్ క్రోర్ క్లబ్లో చేరడంతో శ్రీలీల పేరు ఒక్కదెబ్బకి మారుమోగిపోయింది. ఇప్పుడు అమ్మడు దూకుడు మామ్మూలుగా లేదు. డేట్ ఖాళీ లేకుండా షూటింగ్ చేస్తోంది. పైగా అన్నీ పెద్ద సినిమాలే. అందరూ పెద్ద హీరోలే. చిన్నాచితకా సినిమాలకి, ఆ బాపతు హీరోలవైపు చూడ్డానికి కూడా లేకుండా పోయింది, అందానికి అందం, చురుకుదనానికి చురుకుదనం వీటికి తోడు సక్సెస్…అది శ్రీలీలకి క్రియేట్ అయిన డిమాండ్ కి కారణాలని ట్రెండ్స్ చెబుతున్నాయి.

మహేష్ బాబు, వరుణ్ తేజ్, బాలయ్య.. ఇలా శ్రీలీల కొనసాగుతోంది. రేపు విడుద కాబోతున్న భారీ కమర్షియల్ చిత్రం, బాలయ్య స్టారర్ భగవంత్ కేసరి చిత్రంలో శ్రీలీలది చాలా డిఫరెంట్ రోల్. ఆమె వయసుకు తగినట్టగా, కథకి అవసరమైనట్టుగా బాలయ్య పాత్రకి కూతురు పాత్రను పోషించి అందరినీ మెప్పించిందని యూనిట్లో అందరూ అలవోకగా చెప్పేస్తున్నారు. నిజంగానే ట్రైలర్, టీజర్లు చూస్తుంటే శ్రీలీల ఎంత లక్కీయో తెలుస్తుంది. ఇటువంటి కథలు ఎప్పుడో గానీ రావు. భారీ కమర్షియల్ హీరోల చిత్రాలలో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్లకు సెంటిమెంట్ క్యారెక్టర్స్ రావడం, అవి చాలా సెన్సిటివ్ గా కథను హత్తుకోవడం చాలా అరుదుగా చూస్తాం.

ఇటువంటి కథని దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీలీల గురించే రాశాడా, ఈ కథ అమ్మడి కోసమే పుట్టిందా అన్నట్టు, సినిమా విజయానికి శ్రీలీల క్యారెక్టర్ చాలా కీలకమైపోయిందిప్పుడు. భగవంత్ కేసరి కూడా అందరూ ఊహిస్తున్నట్టుగా గానీ బ్లాక్ బస్టర్ అయితే ఇంక శ్రీలీల డేట్స్ గురించి పెద్ద యుద్ధాలే జరుగుతాయి ఇండస్ట్రీలో. ఇప్పటికే వరుణ్ తేజ్ వివాహం కోసం వరుణ్ కొన్నాళ్ళు బిజీ అయిపోతాడని, ప్రమోషనల్ ఇంటర్వ్యూలు చెయ్యాలంటే శ్రీలీల టైం కోసం మహేష్ బాబు అంతటివాడి షూటింగ్ క్యాన్సిల్ చేసి మరీ టైమ్ కేటాయించాల్సి వచ్చిందని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు.

ఇదెప్పుడో సీతారామయ్యగారి మనవరాలు చిత్రం టైంలో సీనియర్ హీరోయిన్ మీనా విషయంలోజరిగింది. నవ్వినా కన్నీళ్ళే అనే కథ ఆధారంగా దర్శకుడు క్రాంతికుమార్ అక్కినేని నాగేశ్వరరావుతో చేసిన మైల్ స్టోన్ చిత్రం సీతారామయ్యగారి మనవరాలులో మనవరాలి రోల్ కోసం ఎవరిని ఎంపిక చేయాలా అని సందిగ్థంలో ఉన్నప్పుడు మీనా ఎదురైంది. సీతారామయ్యగారి మనవరాలు ఎప్పుడైతే పెధ్ద హిట్ అయిందో చంటి సినిమాలో మీనాని తక్షణమే సెలెక్ట్ చేసేసుకున్నారు. చంటి బ్లాక్ బస్టర్ తర్వాత మీనా మళ్ళీ తిరిగి చూడలేదు. ఇప్పుడు శ్రీలీల ఫరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉంది. అంతకన్నా కాస్తంత ఎక్కువగానే ఉంది. పైగా తెలుగు పిల్ల కావడం, తెలుగు చక్కగా అనర్గళంగా మాట్లాడగలగడం శ్రీలీలకి అదనంగా కలిసొచ్చాయి.

                                                                                                              -నాగేంద్ర కుమార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి