నారా లోకేష్.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడిగా మొదటినుండి ప్రత్యేకమైన గుర్తింపును నారా లోకేష్ పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి,ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ జన్మదినం ఈరోజు.. ఆయన జీవితంలోని విశేషాలను పరిశీలిస్తే….
బాల్యం విద్యాభ్యాసం
సరిగ్గా 37 సంవత్సరాల క్రితం జనవరి 23, 1983న నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు నారా లోకేష్ జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే సాగింది. లోకేష్ పై చదువులన్నీ విదేశాల్లోనే కొనసాగాయి. కార్నెగీ మెలన్ విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంటు ఇన్ఫర్‌మేషన్ సిస్టమ్స్ విభాగంలో బి.ఎస్సీని పూర్తి చేసారు. తర్వాత స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం నుండి ఎంబిఎ విభాగంలో పట్టభద్రులయ్యారు. విద్యాభ్యాసం పూర్తైన తర్వాత తిరిగి రాష్ట్రానికి తిరిగి వచ్చిన లోకేష్ హెరిటేజ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించి హెరిటేజ్ కంపెనీని అభివృద్ధి పథంలో నడిపారు. ఆగస్ట్ 26, 2007 న సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రథమ కుమార్తె బ్రాహ్మణితో లోకేష్ వివాహం జరిగింది.
క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు
లోకేష్ 2009లో ఆంధ్రప్రదేశ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వడివడిగా అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ అంతర్గత నిర్ణయాల్లో లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ 2009 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోను రూపొందించడంలో లోకేష్ కృషి చేసారు. ముఖ్యంగా లోకేష్ రూపొందించిన టీడిపి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన నగదు బదిలీ పథకం ప్రసంశలు దక్కించుకుంది. కానీ ఆ ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలవడంతో ఈ పథకం అమల్లోకి రాలేదు.
తర్వాత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ధర్మకర్తలలో ఒకరిగా ఎన్నికైన నారా లోకేష్ అనేక మంది పేద ప్రజలకు సేవలు అందించారు. 2014 టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయిన లోకేష్ తెలుగుదేశం పార్టీ విధి విధానాలను రూపొందించి, కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ప్రధానపాత్ర వహించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించిన నారా లోకేష్ 2017 లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా పదవులు చేపట్టారు.
పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి ఐటీ శాఖా మంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో ఐటీ రంగ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో పార్టీలో ఉన్న అనేకమంది నేతలు వారిస్తున్నా సరే, ఐటీ శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాన పాత్ర పోషించారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీల స్థాపనకు వీలుగా సులువైన మార్గదర్శకాలను రూపొందించి అనేక కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించారు. విశాఖ పట్నం, మంగళగిరి, గన్నవరం ప్రాంతాల్లో ఐటి రంగం అభివృద్ధి చెందడంతో కీలక పాత్ర పోషించారు.
ఐటీ రంగం కంపెనీల నిర్వహణకు ఆఫీస్ స్పేస్ కోసం గతంలో అనుమతులు లభించడానికి సంవత్సర కాలం పట్టేది. కానీ కేవలం రెండు నెలల్లో ఆఫీస్ స్పేస్ కు అనుమతులు లభించేలా నూతన నిబంధనలు తీసుకొచ్చారు. పంచాయితీ రాజ్ శాఖా మంత్రిగా సాంకేతికంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో 65 లక్షల మందికి పైగా సభ్యత్వాలను పొందడం అప్పట్లో రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.
అవార్డులు
పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా తాగునీటి సరఫరా, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేటప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినూత్నంగా ఉపయోగించినందుకు 2018 లో “స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకున్నాడు.మే 2018 లో న్యూఢిల్లీలో జరిగిన బిజినెస్‌వరల్డ్ డిజిటల్ ఇండియా సదస్సులో లోకేష్ బిజినెస్ వరల్డ్ మ్యాగజైన్ “డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్” ను గెలుచుకున్నారు. అదే సంవత్సరం లోకేష్‌కు కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు- 2018 లో కూడా లభించింది.
విమర్శలు
లోకేష్ వెంట అనేక వివాదాలు కూడా ప్రయాణం చేసాయి. ముఖ్యంగా తండ్రికి తగ్గ తనయుడు కాదని అనేకమంది లోకేష్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు నాయుడుకి తనయుడు లోకేష్ గెలుపుపై నమ్మకం లేకనే ఎమ్మెల్సీగా శాసన మండలిలో చోటు కల్పించారన్న విమర్శలు వచ్చాయి. నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడికి ఉన్నట్లు వాక్చాతుర్యం లేకపోవడం, నారా లోకేష్ మాటల్లో చోటు చేసుకునే తడబాటు ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారాయి. లోకేష్ మాటల్లో తప్పులను ఎత్తి చూపుతూ ప్రత్యర్థి పార్టీలు తీవ్ర విమర్శలు చేసాయి. దానికి తోడు అయనపై అవినీతి ఆరోపణలను కూడా ప్రత్యర్థి పార్టీలు చేసాయి.
విమానాశ్రయంలో లోకేష్ చిరుతిండి కోసం పెట్టిన ఖర్చు 25 లక్షలుగా తేలడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థి పార్టీలపై చురకలు వేయబోయి మాటల తడబాటుతో తన సొంతపార్టీ పైన విమర్శలు చేయడం వల్ల లోకేష్ ని ట్రోల్స్ చేసేవారి సంఖ్య పెరిగింది. తండ్రికి తగ్గ తనయుడు కాదని, లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ మనుగడ సాధించడం కష్టమనే అభిప్రాయాలు కొందరు సొంత పార్టీ నేతల్లోనే వెల్లడయ్యాయి. 2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోవడంతో లోకేష్ రాజకీయ సామర్థ్యంపై అనేకమందికి అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళగిరి ఓటమి వల్ల ప్రత్యక్ష లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలకు పనికి రాడన్న వాదనకు బలం చేకూరినట్లయింది.
కాగా పార్టీ సభ్యత్వాలు ఇప్పించడం వల్ల ఓట్లు రాలవన్న నిజాన్ని గుర్తించి చిత్త శుద్దితో పని చేస్తే భవిష్యత్తులో లోకేష్ విజయావకాశాలను సృష్టించుకునే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎదురైన ఘోర ఓటమినుండి పాఠాలు నేర్చుకుని పార్టీని ముందుకు ఎలా తీసుకు వెళ్లాలన్న దృఢ నిశ్చయంతో లోకేష్ ముందుకు సాగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తుతో పాటు పార్టీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది.
లోకేష్ కు ఓటమి నేర్పిన పాఠాల నుండి ఎన్నో విషయాలు గ్రహించి గెలుపు ద్వారాలకు చేరుకోవాలని, రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎదగాలని ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ “హ్యాపీ బర్త్ డే లోకేష్”