అమ్మ ప్రేమ ఒక వైపు.. కరోన కట్టడి మరోవైపు..

బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో
విశాఖ నగరంలో పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చేసేందుకు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. నగర పరిధిలో కరోనా వ్యాప్తి చెందకుండా, ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించేలా రెండు జోన్లకు ఒక మొబైల్‌ శాంపిల్‌ కలెక్షన్‌ టీమ్‌ని ఏర్పాటు చెయ్యాలని ఆదేశిస్తున్నారు.

ఇంతలో ఇంటి నుంచి ఫోన్‌ వచ్చింది… బిడ్డ ఏడుస్తున్నాడని…
ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ.. నెల వయసున్న బిడ్డ సంగతే మరిచిపోయిన కమిషనర్‌ ఆందోళన పడ్డారు.

టెలికాన్ఫరెన్స్‌ మధ్యలో ఆపేస్తే.. సిబ్బంది విధులకు విఘాతం కలిగిస్తున్నట్లు అవుతుందని భావించారు.అందుకే.. బిడ్డని తన చాంబర్‌కి తీసుకురమ్మని చెప్పారు.ఇంటి నుంచి వచ్చిన నెల రోజుల పసికందుని ఓ చేత్తో లాలిస్తూ.. మరోవైపు టెలికాన్ఫరెన్స్‌ కొనసాగించారు.

ప్రసవించిన ముందు రోజు వరకూ విధులు నిర్వర్తించిన జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన.. ప్రసూతి సెలవులు ఇంకా ముగియ కుండానే.. 22 రోజులకే విధుల్లో చేరి అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా కేసులు విశాఖ మహా నగరంలో బయట పడిన విషయం తెలుసుకున్న ఆమె.. నగరంలో తీసుకోవాల్సిన చర్యల్ని పక్కాగా అమలు చేసేందుకు బాలింతగా ఉన్న సమయంలోనే బాధ్యతలు భుజాన వేసుకున్నారు.

బుధవారం మధ్యాహ్నం.. చంటి బిడ్డని లాలిస్తూనే.. టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆమెకు విధి నిర్వహణలో ఉన్న నిబద్ధతకు పేషీ సిబ్బంది సలాం చేశారు. అలా మాతృత్వపు మమకారం ఒకవైపు.. కరోనా కల్లోలం నుంచి ప్రజల్ని ఒడ్డున పడేసే బృహత్తర బాధ్యత మరోవైపు, ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన. ఆమెకు వందనాలు చెబుదాం.

Show comments